అమ్మ ఆకలి ఘోష!
-నడిరోడ్డుపై ఉన్న వృద్ధురాలు
-పట్టించుకోని కొడుకులు
-చలికి వణుకుతూ నడిరోడ్డుపై నరకం
-గ్రామస్థులు పెట్టే భోజనంతోనే కడుపు నింపుకుంటున్న తల్లి
కొమరోలు, డిసెంబరు 15(ప్రజాక్షేత్రం):వృద్ధాప్యంలో కుటుంబ సభ్యుల ఆసరా కరువై ఓ వృద్ధురాలు నడిరోడ్డుపై బతుకీడుస్తోంది. చలికి వణుకుతూ దీనావస్థలో కొట్టుమిట్టాడుతోంది. అందిన సమాచారం మేరకు.. కొమరోలు మండలం వెన్నంపల్లి గ్రామానికి చెందిన ఇండ్ల వెంకట లక్ష్మమ్మ (75)కు ముగ్గురు కుమారులు ఉన్నారు. భర్త ఆరేళ్ల క్రితం మృతి చెందారు. కుటుంబ ఆస్తులను కుమారులు పంచుకున్నారు. ఈమె కోసం ఎకరం పొలం, చిన్న పూరిపాక కేటాయించారు. ప్రభుత్వ పింఛన్ వస్తుండడంతో దాన్ని ఇప్పటి వరకు కుమారులే తీసుకుంటూ తలా కొన్నాళ్లు భోజనం పెట్టారు. ఇప్పుడు వయసు పైబడటంతో ఆలనాపాలనా చూడడానికి కుటుంబ అవసరం వచ్చింది. అయితే ముగ్గురు కుమారులు కొమరోలు చుట్టుపక్కల గ్రామాల్లోనే స్థిరపడినా ఆమెను నిర్లక్ష్యం చేశారు. ఉన్న పూరి పాక కూడా శిథిలం కావడంతో ఆమె రోడ్డుపైకి వచ్చింది. 20 రోజులుగా ఎముకలు కొరికే చలిలో రోడ్డుపై వృద్ధురాలు ఉండడం గ్రామస్థులను సైతం కలచివేసింది. ఆమె దుస్థితిపై కుమారులకు సమాచారం ఇచ్చినా వారి నుంచి సరైన స్పందన రాలేదని తెలిసింది. దీంతో ఆమె ఆకలి అన్నప్పుడు గ్రామస్థులే ఆమెకు భోజనం అందిస్తున్నారు.