Praja Kshetram
తెలంగాణ

ఖాకీ కర్కశత్వం

ఖాకీ కర్కశత్వం.!

 

-ప్రభుత్వ ఉద్యోగిని చితకబాదిన వనపర్తి రూరల్ ఎస్సై జలంధర్ రెడ్డి

-ఎస్పీ గిరిధర్ జోక్యంతో వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితుడికి చికిత్స

-ఒంటినిండా తీవ్ర గాయాలతో అల్లాడుతున్న బాధితుడు

-ఎస్సై తీరుపై సర్వత్రా విమర్శలు

వనపర్తి డిసెంబర్ 20(ప్రజాక్షేత్రం): భార్యాభర్తల మధ్య తలెత్తిన గొడవల నేపథ్యంలో రాజీ కుదిరించాల్సిన వనపర్తి రూరల్ ఎస్సై జలంధర్ రెడ్డి అత్యుత్సాహం చూపి ఓ ప్రభుత్వ ఉద్యోగిని కర్కశంగా చితకబాదిన ఉదంతం వనపర్తి జిల్లా కేంద్రంలో సంచలనం సృష్టించింది. కోడేరు మండలం ఎత్తం గ్రామానికి చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగికి మహబూబ్నగర్ సమీపంలోని బండమీదిపల్లి గ్రామానికి చెందిన ఓ అమ్మాయితో ఏడు నెలల క్రితం వివాహమైంది. భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తడంతో సదరు అమ్మాయి తరపు బంధువులు బాధితుడిపై వనపర్తి రూరల్ పోలీసు స్టేషన్ ఎస్ఐ జలంధర్ రెడ్డికి ఫిర్యాదు చేయడంతో ఇరువర్గాలను పిలిచి దంపతుల మధ్య సయోధ్య కుదిరించాల్సింది పోయి అందుకు భిన్నంగా వ్యవహరించారు. నేరస్తులు, దోపిడీదారులు, కబ్జాదారుల కంటే దారుణంగా లెదర్ బెల్టుతో శరీరం అంతా కమిలిపోయే విధంగా చితకబాదాడు. బాధితుడు తాను ప్రభుత్వ ఉద్యోగినని తాను చెప్పేది కూడా కాస్త వినండి సార్ అంటూ మొరపెట్టుకున్నప్పటికీ వినకుండా తనను కొట్టడంతో పాటు తన తరపు ఆడపడుచులను ఇష్టానుసారంగా దూషించడం తగదని ఎంత మొరపెట్టుకున్నా వినకుండా అరికాళ్ళు, పిరుదులు, మోచేతులు, తొడలు, వీపులు కమీలిపోయేలా ఇష్టానుసారంగా కొట్టాడని బాధితుడు వాపోయాడు. దెబ్బల తాకిడి తట్టుకోలేక పోలీసు స్టేషన్ లో ఓ మూలకు పడిపోయినప్పటికీ రాత్రి 8:30 గంటలు దాటిపోతున్నా బయటికి వదలకుండా చిత్రహింసలకు గురి చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం ఆ నోట, ఈ నోట జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ కు చేరడంతో ఆయన వెంటనే స్పందిస్తూ వనపర్తి సీఐ ని ఆదేశిస్తూ పరిస్థితిపై ఆరా తీసినట్లు తెలిసింది. సదరు ఎస్సై చేతిలో దాడికి గురైన బాధితుడు ఎస్పీ ఆదేశాల మేరకు వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. దాడికి కారకులైన తన భార్య తరపు బంధువులతో పాటు ఎస్సై జలంధర్ రెడ్డి విచక్షణారహితంగా కొట్టాడని మెడికో లీగల్ కేస్ డైరీలో వారి పేర్లను వైద్యులకు తెలిపినట్లు తెలిసింది. బాధితుడు కోలుకున్న తర్వాత సదరు ఎస్సై పై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో పాటు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు తెలిసింది. కాగా రూరల్ పోలీస్ స్టేషన్ లో జరిగిన ఉదంతాన్ని తెలుసుకునేందుకు ప్రజాక్షేత్రం ప్రతినిధి సదరు ఎస్సై జలంధర్ రెడ్డికి పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ అందుబాటులోకి రాలేదు.

Related posts