చేవెళ్లలో త్వరలోనే ఉప ఎన్నిక.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
షాబాద్ జనవరి 17(ప్రజాక్షేత్రం):చేవెళ్ల నియోజకవర్గంలో త్వరలోనే ఉప ఎన్నిక రాబోతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసాలను రైతులు, ఆడబిడ్డలు ఎండగట్టాలని కేటీఆర్ సూచించారు. రంగారెడ్డి జిల్లా షాబాద్లో ఏర్పాటు చేసిన రైతు ధర్నాలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. చేవెళ్ల నియోజకవర్గంలో త్వరలో ఉప ఎన్నిక రాబోతోంది. కేసీఆర్కు ఓటేయడంతో ఇక్కడున్న ఎమ్మెల్యే గెలిచిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సంకలో జొచ్చిండు. అభివృద్ధి కోసం పోయాను అని అంటుండు. ఈ ఏడాదిలో ఏం అభివృద్ధి జరిగింది..? రైతుబంధు, రుణమాఫీ, రైతుబీమా అమలైందా..? ఆడబిడ్డలకు తులం బంగారం, స్కూటీ ఇచ్చావా..? ఏం అభివృద్ధి అయింది.. ఉన్నది పీకింది. ఎన్నికలు వచ్చినప్పుడు చేవేళ్లలోనే కాదు.. పార్టీ మారిన ఎమ్మెల్యేల 10 నియోజకవర్గాల్లో బుద్ధి చెబుదాం. రైతు భరోసా వేయనందుకు, వానాకాలం రైతుబంధు ఎగ్గొట్టినందుకు, రుణమాఫీ మోసం చేసిందుకు, ఆడబిడ్డలకు రూ. 2500 ఇవ్వనందుకు, మా భూమి మాకే ఉండాలన్న పాపానికి 40 మంది రైతులను జైల్లో పెట్టి హంసించినందుకు.. కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుదాం. చివరకు వృద్ధులను కూడా మోసం చేసిండు. ఆసరా పెన్షన్లు 4 వేలు ఇవ్వడం లేదు అని కేటీఆర్ ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి నోటికి హద్దు లేదు. మందికి పుట్టిన బిడ్డలను మా బిడ్డలు అని చెప్పుకుంటుండు. కేసీఆర్ ఇచ్చిన 44 వేల ఉద్యోగాలను నేను ఇచ్చిన అని చెప్పుకుంటూ మోసం చేస్తున్నాడు. ఇవాళ షాబాద్లో జరిగిన ధర్నా మొట్టమొదటి.. మిగతా చోట్ల కూడా ధర్నా చేస్తాం. 70 లక్షల మంది రైతుల పక్షాన, 22 లక్షల మంది కౌలు రైతుల పక్షాన, భూమి లేని నిరుపేదల పక్షాన అడుగుతున్నాం.. ఇచ్చిన మాట నిలబెట్టుకో.. అందరికీ రైతుభరోసా జమ చేయ్.. లేదంటే రేపు పంచాయతీ ఎన్నికల్లో నీ వీపు చింతపండు చేస్తారు మా ఆడబిడ్డులు, రైతులు. ఇది ఆరంభం మాత్రమే.. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతూనే ఉంటాం.. ఎన్ని కేసులు పెట్టినా.. జైళ్లకు పంపించినా రైతుల పక్షాన పోరాడుతూనే ఉంటామని కేటీఆర్ తేల్చిచెప్పారు.