రెడ్లపై ఎందుకు చర్యలు తీసుకోరు..?
– కాంగ్రెస్ పార్టీపై సంచలన ఆరోపణలు చేసిన మధుయాష్కీ గౌడ్
హైదరాబాద్ మార్చి 05(ప్రజాక్షేత్రం):కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ పార్టీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా పార్టీ లోని క్రమశిక్షణ అంశంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రెడ్డి, అగ్రవర్ణ నేతలు క్రమశిక్షణ ఉల్లంఘనలకు పాల్పడినా, వారిపై ఎలాంటి చర్యలు తీసుకోరని మధుయాష్కీ ఆరోపించారు. “కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు చిన్నా రెడ్డే స్వయంగా క్రమశిక్షణ తప్పారు. ఆయన తన సొంత పార్టీ ఎమ్మెల్యే మేఘా రెడ్డిపై బహిరంగంగా ఆరోపణలు చేశారు. మరి ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం ఎందుకు జరగలేదు?” అని ఆయన ప్రశ్నించారు.
– బీసీ నేతలకు అన్యాయం!
కుల గణనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించినా, ఆ సమావేశానికి బీసీ నేతల ప్రాధాన్యత లేకపోవడం తమను తీవ్రంగా కలిచివేసిందని మధుయాష్కీ పేర్కొన్నారు. “జానా రెడ్డి, కేశవరావులను ఆ మీటింగ్కు ఆహ్వానించారు. కానీ బీసీ నేత అయిన నన్ను పిలవలేదు. ఇది బీసీలను కించపరిచే చర్య” అని ఆయన విమర్శించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరింత లోతుగా బయటపడుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.