సమస్యలను ఎత్తిచూపితే సస్పెండ్ చేస్తారా..? మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
బడంగ్ పేట్, మార్చి 14(ప్రజాక్షేత్రం):ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపినందుకు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ చేయడం దారుణమని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడ్జెట్ సెషన్ పూర్తయ్యేదాకా సస్పెండ్ చేయడం మంచి పద్ధతి కాదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుష్టపాలన కొనసాగిస్తున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో సమస్యలను ప్రస్తావించకుండా చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుందన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆమె ఆరోపించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఎక్కడ తప్పు మాట్లాడారో చెప్పకుండా జగదీశ్ రెడ్డిని ఎలా సస్పెండ్ చేస్తారని ఆమె ప్రశ్నించారు. ఎక్కడ కూడా స్పీకర్ను కించపరిచే విధంగా మాట్లాడలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటుందని ఆమె మండిపడ్డారు. సరైన సమయంలో సరైన గుణపాఠం చెప్తారని తెలిపారు. ఇచ్చినా హామీలను నెరవేర్చమంటే సస్పెండ్ చేసుడేందని ఆమె అడిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగానే సస్పెండ్ చేసిందన్నారు. సభను సజావుగా నడపలేక సభ్యుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త సాంప్రదాయాలకు తెరలేపుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆమె అన్నారు. కాంగ్రెస్ పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందన్నారు. తప్పుడు నిర్ణయాలతో ప్రజల చులకన అవుతున్నారన్న సంగతి మర్చిపోతున్నారని ఆమె పేర్కొన్నారు. ఇప్పటికే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత పెరిగింది అన్నారు. రైతుల సమస్యలను సర్కార్ పట్టించుకోవడం లేదన్నారు. సమస్యలు ఉన్నాయని ప్రస్తావిస్తే ఏకపక్షంగా సస్పెండ్ చేయడం ఏమిటని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.