మాదిగలకు రేవంత్ తీరనిద్రోహం.
– ఎస్సీ వర్గీకరణ ఖాళీ కొబ్బరి చిప్పతో సమానం.
– ఓవర్గంతో కుమ్మక్కై మాదిగలకు మోసం.
– ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ.
ఖైరతాబాద్, మార్చి 19(ప్రజాక్షేత్రం):ఎస్సీ వర్గీకరణతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాదిగ నిరుద్యోగులకు తీరని ద్రోహం చేశారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అనేది ఉత్త ఖాళీ కొబ్బరిచిప్పతో సమానమని ఎద్దేవా చేశారు. ఉత్త చిప్పను మాదిగలకు ఇచ్చి, ఉద్యోగాలన్నీ మరో వర్గానికి కట్టబెట్టారని ధ్వజమెత్తారు. వర్గీకరణను వర్తింపజేయకుండానే ఉద్యోగాలన్నీ భర్తీచేస్తే మాదిగ నిరుద్యోగ యువతకు చేసిందేమీ లేదని చెప్పారు. వర్గీకరణ చట్టం చేయక ముందే సీఎం హడావుడిగా గ్రూప్ 1, 2, 3, ఇతర శాఖల్లోని ఉద్యోగ నియామకాలు చేపడుతూ, ఉద్యోగ అవకాశాలన్నీ ఒక వర్గానికే దోచిపెడుతున్నారని ఆరోపించారు. మంత్రి రాజనర్సింహాతో రాజీపడి ఒక్క వర్గానికే అన్ని ఉద్యోగాలు కట్టబెడుతున్నారని చెప్పారు. మాల, మాదిగల మధ్య ఘర్షణ వాతావరణం తగ్గించలేకపోయారని, కనీసం రెండు వర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులను కూర్చోబెట్టి మాట్లాడించలేకపోయారని ఆరోపించారు.