వరుసగా.. 4 రోజులు బ్యాంకులు బంద్
హైదరాబాద్ మార్చి 20(ప్రజాక్షేత్రం):బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్ న్యూస్. వరుసగా 4రోజుల సెలవులు రావడంతో బ్యాంకింగ్ సేవలు పొందాలనుకుంటున్న ఖతాదారులు బ్యాంకులకు పరుగులు పెట్టాల్సివస్తుంది. ఈనెల 22 (నాలుగో శనివారం) 23 (ఆదివారం) 24, 25 బ్యాంకుల సమ్మె కారణంగా బ్యాంకులు పని చేయవు. బ్యాంకు ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారం కోసం ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA)తో జరిగిన చర్చలు విఫలమవడంతో బ్యాంక్ యూనియన్లు సమ్మెకు పిలుపునిచ్చారు. వచ్చే వారంతో రెండు రోజుల పాటు సమ్మె కారణంగా బ్యాంకుల సేవలు నిలిచిపోనున్నాయి. అయితే బ్యాంకుల సమ్మె కంటే ముందు అంటే మార్చి 22 నుంచే బ్యాంకు సేవలు నిలిచిపోనున్నాయి. మార్చి 22న నాల్గవ శనివారం, తరువాత ఆదివారం బ్యాంకులకు సెలవులు. ఆ తర్వాత మార్చి 24, 25 (సోమ, మంగళవారం) బ్యాంకుల సమ్మె నేపథ్యంలో దాదాపు నాలుగు రోజుల పాటు బ్యాంకు సేవలకు అంతరాయం కలుగనుంది.
బ్యాంకు ఉద్యోగుల సమ్మెలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులతో పాటు ప్రాంతీయ, గ్రామీణ బ్యాంకు సిబ్బంది కూడా పాల్గొననున్నారు. బ్యాంకు ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(యూఎఫ్బీయూ) మార్చి 23 అర్ధరాత్రి నుంచి మార్చి 25 అర్ధరాత్రి వరకు సమ్మెకు పిలుపునిచ్చింది. యూఎఫ్బీయూ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ కె.ఆంజనేయప్రసాద్, ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ బీఎస్ రాంబాబులు సమ్మె విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బ్యాంకింగ్‌రంగం నానాటికీ విస్తరిస్తున్నప్పటికీ తదనుగుణంగా నియామకాలు లేక పనిభారం పెరుగుతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో 2013 నుంచి 2024 వరకు లక్షకుపైగా ఉద్యోగులు తగ్గడంతో మెరుగైన సేవలు అందించలేకపోతున్నామని తెలిపారు. ప్రభుత్వరంగ బ్యాంకుల పరిరక్షణ కోసమే ఈ సమ్మె చేపడుతున్నట్టు స్పష్టంచేశారు. ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన ఉద్యోగుల పనితీరు సమీక్షించే విధానం, పీఎల్‌ఐ మార్గదర్శకాలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని కోరారు. ఇప్పటికైనా కేంద్రప్రభుత్వం, బ్యాంకు యాజమాన్యాలు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్‌చేశారు.