రెవెన్యూ కోసం ఉత్తమ్, హోం కోసం మల్లు పట్టు! ఇప్పటికి ఖరారైన ఆ నలుగురూ వీరే!
– సురేఖ నుంచి అటవీ శాఖ తొలగింపు?
– ఇండస్ట్రీస్ కోసం వివేక్ వల!
– మైనారిటీ మంత్రిగా అమేర్?
– మొత్తంగా నలుగురి పేర్లు ఇప్పటికి ఫైనల్?
హైదరాబాద్ మార్చి 26(ప్రజాక్షేత్రం):తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు మరికొద్ది రోజులే సమయం ఉండటంతో మంత్రులు తమకు కావాల్సిన శాఖల కోసం ఆరాటపడుతున్నారు. కొత్త శాఖల కోసం తమతమ స్థాయిల్లో అధిష్ఠానం వద్ద పైరవీలు చేసుకుంటున్నారు. శాఖల కేటాయింపులు, మార్పులను ఢిల్లీ పెద్దలే చూస్తున్నారు. బుధవారం సాయంత్రం వరకు అందిన సమాచారం ప్రకారం ఎమ్మెల్యేలు వాకిటి శ్రీహరి, జీ వివేక్ వెంకటస్వామి, పీ సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ అమేర్ అలీఖాన్ పేర్లు దాదాపు ఖరారయ్యాయని అంటున్నారు.
– పౌర సరఫరాలొద్దు.. రెవెన్యూ ఇవ్వండి!
తన నుంచి పౌర సరఫరాల శాఖ తొలగించి రెవెన్యూ శాఖను కేటాయించాలని నీటి పారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ పెద్దలకు వినతి చేశారని తెలుస్తున్నది. ప్రభుత్వానికి, పార్టీకి పేరు తెచ్చేలా పనిచేస్తానని కూడా చెప్పారట. ఒక వేళ రెవెన్యూ ఇవ్వని పక్షంలో ఆర్థిక శాఖనైనా అప్పగించాలని కోరినట్టు తెలుస్తున్నది. హోం శాఖను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి చూస్తున్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా హోం, విద్యా శాఖలను కొత్తగా చేరే వారు లేదా ఉన్నవారిలో ఎవరికైనా ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఇప్పటి వరకు హోం శాఖ ముఖ్యమంత్రి వద్దే ఉండటంతో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు ఇబ్బంది రాలేదు. మరో మంత్రికి ఇస్తే ప్రొటోకాల్ పరంగా తనకు అంతగా ప్రాధాన్యం ఉండదని భావించిన మల్లు అప్రమత్తమయ్యారని తెలుస్తున్నది. విద్యుత్ శాఖ స్థానంలో తనకు హోం కేటాయించాలని అధిష్ఠానం వద్ద పట్టుబట్టినట్టు చెబుతున్నారు. తన వినతిని పార్టీ పెద్దలు మన్నిస్తే ప్రొటోకాల్ పరంగా సీఎంతో సమానంగా ఉంటుందనే ధీమాతో ఉన్నట్లు ఆయన సిబ్బంది గుసగుసలాడుతున్నారు. సచివాలయంలో కానీ, బయట కానీ ముఖ్యమంత్రికి ఏ విధమైన ప్రొటోకాల్ ఉంటుందో.. అదే తరహాలో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కకు సైతం ఉన్నాయి. సచివాలయంలో ఆయన చాంబర్ ముందు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రికి నలుగురు పౌర సంబంధాల అధికారులు ఉండగా మల్లు భట్టికి ఇద్దరు ఉన్నారు. ముఖ్యమంత్రి చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ (సీపీఆర్వో)కు ఏ విధమైన హోదా ఉందో అదే హోదాను డిప్యూటీ సీఎం వద్ద పనిచేసే ఇద్దరిలో ఒకరికి కల్పించారు.
– పొంగులేటి నుంచి రెవెన్యూ తొలగింపు?
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ శాఖతో పాటు గృహ నిర్మాణం, పౌర సంబంధాల శాఖలను పర్యవేక్షిస్తున్నారు. పదహారు నెలల కాలంలో రెవెన్యూ శాఖను పూర్తిగా బదనాం చేశారనే అపవాదును కాంగ్రెస్ ప్రభుత్వం మూటగట్టుకున్నది. అంతర్గతంగా పెద్ద పెత్తున వివాదాస్పద భూములను సరిచేస్తున్నారనే విమర్శలు గుప్పుమంటున్నాయి. వివాదాస్పద భూముల బదలాయింపులో వందల కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయని, బయటకు పొక్కకుండా సర్ధుబాటు చేస్తున్నారని గాంధీ భవన్ వర్గాలే కోడై కూస్తున్నాయి. ఆయన ఉన్నంత వరకు చాంబర్‌లోకి అడుగు పెట్టేది లేదని, అవసరమైతే మీ వద్దకు వస్తామని ఇద్దరు ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కొద్ది రోజుల క్రితం స్పష్టం చేశారని విశ్వసనీయ సమాచారం. తమకు తెలియకుండా భూ వివాదాలను చక్కబెడుతున్నారని, ఆ పని పూర్తి అయిన తరువాతే తమకు తెలుస్తున్నదని వారు ఆవేదన వ్యక్తం చేశారని అంటున్నారు. ఇలా తమ ప్రత్యర్థులకు సాయం చేస్తే, వచ్చే ఎన్నికల్లో ఎలా గెలుపొందుతామని ముఖ్యమంత్రి వద్దే ప్రశ్నించినట్టు చర్చ జరుగుతోంది. అధిష్ఠానం కూడా పొంగులేటి నుంచి రెవెన్యూ శాఖను మార్చాలని నిర్ణయం తీసుకుందని అంటున్నారు.
– దేవాదాయానికే కొండా పరిమితం?
కొండా సురేఖ నుంచి అటవీ శాఖను తప్పించి, దేవాదాయ శాఖకు పరిమితం చేయవచ్చని తెలిసింది. పనితీరు బాగా లేదని శాఖను కుదిస్తున్నారని, వాస్తవానికి అది కాదని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. ఐటీ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి డీ శ్రీధర్ బాబు నుంచి పరిశ్రమల శాఖను తొలగించనున్నారని అంచనా. ఆ శాఖను కొత్తగా మంత్రివర్గంలో చేరే జీ వివేక్ వెంకటస్వామికి ఇచ్చే పరిస్థితులు కన్పిస్తున్నాయని చెబుతున్నారు.
– విస్తరణపై మాదిగల మండిపాటు
మంత్రివర్గ విస్తరణపై మాదిగ కులం ఎమ్మెల్యేలు భగ్గుమంటున్నారు. రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో అసలైన మాదిగలు లేరని, అధికారంలోకి తెచ్చిన పాపానికి తమ కులానికి అన్యాయం చేస్తారా? అంటూ మండిపడుతున్నారు. మాదిగ కులానికి చెందిన ఎమ్మెల్యేలు మందుల సామేల్, వేముల వీరేశం, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కవ్వంపల్లి లక్ష్మీనారాయణ, తోట లక్ష్మీకాంత రావు, కాలే యాదయ్య.. పార్టీ పెద్దలు రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గేకు ఈ విషయంలో ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో 37 లక్షల మంది మాదిగలు ఉన్నారని, మొన్న జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క మాదిగకు కూడా సీటు ఇవ్వలేదని పేర్కొన్నారు. త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో అసలైన మాదిగ ఎమ్మెల్యేకు ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు.
– లంబాడాలను విస్మరిస్తారా?
మంత్రివర్గంలో లంబాడాలు ఒక్కరు కూడా లేరని, ఎస్టీలో గెలిచిన ఎమ్మెల్యేల్లో అత్యధికం లంబాడాలే ఉన్నారని ఆ కులం ఎమ్మెల్యేలు ఢిల్లీలోని పార్టీ ముఖ్యులకు ఫిర్యాదు చేశారు. వచ్చే నెల 3న చేపట్టే విస్తరణలో లంబాడాలకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఎస్టీ రిజర్వుడ్ సీట్లలో లంబాడాలు ఉన్న నియోజకవర్గాల్లోనే పార్టీ గెలుపొందిందని ఆ లేఖలో వివరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో విస్తరణలో మార్పులు ఉంటాయా లేదా అనేది కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.