మంత్రి పదవుల వేటలో.. హస్తిన బాట..
– తెలంగాణ కేబినెట్ విస్తరణపై కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్.
– మంత్రి పదవుల కోసం ఆశావహులైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఢిల్లీ బాట.
– అసెంబ్లీ సమావేశాలు ముగిసిందే తడవుగా ఢిల్లీ విమానం ఎక్కెశారు.
– ఒకరు తర్వాత ఒకరు వరుసగా ఢిల్లీకి క్యూ.
హైదరాబాద్ మార్చి 28(ప్రజాక్షేత్రం):తెలంగాణ కేబినెట్ విస్తరణపై కాంగ్రెస్ అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మంత్రి పదవుల కోసం ఆశావహులైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఢిల్లీ బాట పట్టారు. మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలన్న దానిపై కాంగ్రెస్ అధిష్ఠానం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చిందని చెబుతున్నా.. ప్రయత్నిస్తే పోయేదేముంది? అనుకుంటూ ఆశావహులు తమ వంతు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఢిల్లీ కాంగ్రెస్ పెద్ధలను కలిసి మంత్రి మండలిలో ప్రాతినిధ్యం కోసం ఎవరి తిప్పలు వారు పడుతున్నారు. తెలంగాణ కేబినెట్‌లో ప్రస్తుతం ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. విస్తరణలో భాగంగా ఎంతమందికి అవకాశమిస్తారన్నదానిపై స్పష్టత లేకపోయినా పదవుల కోసం ఆశావహులు పదుల సంఖ్యలోనే ఉన్నారు. వారు మంత్రి పదవుల కోసం కాంగ్రెస్ పెద్దలను కలిసేందుకు ఒక్కొక్కరుగా ఢిల్లీ చేరుకుంటున్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిందే తడవుగా ఢిల్లీ విమానం ఎక్కేశారు. ఒకరు తర్వాత ఒకరు వరుసగా ఢిల్లీకి క్యూ కట్టారు. దీంతో రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలు దేశ రాజధానికి మారినట్లయ్యింది. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, బాలునాయక్ ఢిల్లీకి చేరుకుని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌లను కలిశారు. ఇక డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సైతం ఢిల్లీకి బయలు దేరారు. అహ్మదాబాద్ లో జరిగే ఏఐసీసీ సమావేశాల కోసం ఏర్పాటు చేసిన ముసాయిదా కమిటీ(డాఫ్టింగ్ కమిటీ) సమావేశానికి భట్టి హాజరుకానున్నారు. మరోవైపు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సైతం ఢిల్లీలోనే ఉన్నారు. మంత్రివర్గంలో స్థానం కోరుతున్న కాంగ్రెస్ మాదిగ, లంబాడీ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు సైతం తమ ప్రయత్నాలు చేసేందుకు ఢిల్లీకి పయనమయ్యారు. మరి హస్తిన చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఎవరి ప్రయత్నాలు ఫలించి అమాత్యులయ్యే అదృష్టవంతులెవరన్నది ఏప్రిల్ 3వ తేదీలోగా తేలిపోనుంది.