ట్యాంకర్ తో పొలానికి నీరు.. పంటను కాపాడుకోవడానికి రైతుల పాట్లు..
జనగామ మార్చి 31(ప్రజాక్షేత్రం): చుట్టుపక్క గ్రామాల్లో నీరు లేక రోజురోజుకు భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. ఇప్పటికే వేలాది బోర్లు ఎండిపోవడంతో తీర ప్రాంతాల్లో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. ముందు ముందు ఇంకా ఎండాకాలం ఉండడంతో తాగునీటికి సైతం ప్రజల తిప్పలు పడే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో భూగర్భ జలాలు రోజు రోజుకు పడిపోవడంతో వరి పంట ఎండిపోకుండా కాపాడుకోవడానికి సోమవారం రఘునాథపల్లి మండలం మేకలగట్టు గ్రామంలో రైతు రజినీకాంత్ ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించి పోస్తున్నాడు. రజినీకాంత్ రెండు ఎకరాల్లో వరి పంట వేశాడు. ఒక బోరు, ఒక బావి, ఉండగా బాయి ఎండి పోయింది. బోరు నుంచి ధారగా నీరు వస్తోంది. భూగర్భ జలాలు అడుగంటడంతో ఎకరం, వదిలి పెట్టి మరో ఎకరానికి ట్యాంకర్ ద్వారా నీరు పెట్టి పంటను కాపాడుకుంటున్నాడు. ఇందుకు నీరు అందించినప్పుడు రూ.మూడు నుండి ఐదు వేల వరకు ఖర్చు చేస్తున్నాడు. మూడు రోజులకు ఒకసారి ఐదు ట్యాంకర్ల ద్వారా నీరు పెడుతున్నట్లు రైతు తెలిపారు.
