Praja Kshetram
తెలంగాణ

ఆ ఊరిలో జనాల వింత ప్రవర్తన – ఆ మహమ్మారి వల్లే అంటున్న స్థానికులు! 

ఆ ఊరిలో జనాల వింత ప్రవర్తన – ఆ మహమ్మారి వల్లే అంటున్న స్థానికులు!

 

– కామారెడ్డి జిల్లాలోని మాల్లాపూర్‌లో కల్లు దొరకకపోవడంతో వింతగా ప్రవర్తిస్తున్న స్థానికులు.

– ఇటీవల కల్తీ కల్లుతో 68 మందికి అస్వస్థతకు గురి కావడంతో కల్లు దుకాణం మూసివేత.

కామారెడ్డి ఏప్రిల్ 16(ప్రజాక్షేత్రం):కామారెడ్డి జిల్లా మాల్లాపూర్‌లో కల్లు దొరకకపోవడంతో స్థానికులు వింతగా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల కల్తీ కల్లుతో 68 మంది అస్వస్థతకు గురయిన విషయం తెలిసిందే. దీంతో ఆబ్కారీ శాఖ అధికారులు ఆ కల్లు దుకాణాన్ని మూసివేశారు. కల్లు దుకాణం మూసి ఉంచడంతో జనం సొమ్మసిల్లి పడిపోవడం, మెడ వంకరగా తిప్పి వింతగా ప్రవర్తిస్తున్నారు. కల్తీ కల్లులో అధికంగా అల్ఫోజం కలపడం వల్లనే ఇలా జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

– ఆవేదన వ్యక్తం చేస్తున్న ప్రజలు

కల్తీ కల్లు నిర్వాహకులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మల్లాపూర్‌ గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కృత్రిమంగా కల్తీ కల్లు తయారు చేసే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

– శరీరంలో ఒక్కో భాగంపై ప్రభావం

కల్తీ కల్లు తయారీలో అల్ఫ్రాజోలంను మోతాదుకు మించి కలపడంతో దానిని తాగిన వారిలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉత్ఫన్నమవుతాయి. ఎక్కువగా కాలేయం మీద తీవ్ర ప్రభావం పడుతుంది. ఆ తర్వాత శరీరంలో ముఖ్య భాగాలైన కిడ్నీలు క్రమక్రమంగా చెడిపోతాయి. ఆ తర్వాత మెదడుపై ప్రభావం చూపించడంతో ఆలోచనాశక్తి కోల్పోయి విచక్షణ లేకుండా ప్రవర్తించడం మొదలుపెడతారు. కొద్దిరోజుల తర్వాత కనీసం సరిగ్గా నడవలేరు. బాధితులు అనుకున్నప్పుడు కల్తీ కల్లు అందుబాటులో లేకుంటే ఫిట్స్‌ వచ్చి మూర్ఛకు గురవుతారు. ఇలా ఒక్కొక్కటిగా శరీర భాగాలన్నింటిపై అల్ఫ్రాజోలం, ఇతర నిషేధిత మత్తు పదార్థాలు వాటి తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి.

– మెల్లగా వ్యసనంగా

అల్ఫ్రాజోలం విరివిగా వినియోగించడంతో వ్యక్తిలో గందరగోళ పరిస్థితులు, ఆందోళన పెరిగి తీవ్రమైన మానసిక ఒత్తిడి ఏర్పడవచ్చు. నిద్రలేమి, ఒంటినొప్పులతో బాధపడుతున్న కొంతమంది ఉపశమనం కోసం మొదటగా కల్తీ కల్లు తాగుతున్నారు. తదనంతరం ఆ అలవాటు కాస్త వ్యసనంగా మారుతోంది. అది లేదంటే ఉండలేని విధంగా మారుపోతున్నారు.

Related posts