Praja Kshetram
తెలంగాణ

ఆ ఉద్యోగులకు గుడ్న్యూస్ – వచ్చే నెల నుంచి నెల నెలా జీతాలు  

ఆ ఉద్యోగులకు గుడ్న్యూస్ – వచ్చే నెల నుంచి నెల నెలా జీతాలు

 

 

తెలంగాణ బ్యూరో ఏప్రిల్ 16(ప్రజాక్షేత్రం): పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో పని చేసే చిరుద్యోగులకు మే నెల నుంచి సకాలంలో వేతనాలు చెల్లించాలని ఆ శాఖ నిర్ణయించింది. దాదాపు ఇందులో పనిచేసే 92 వేల మందికి ప్రతి నెలా సుమారు రూ.115 కోట్ల చొప్పున జీతాలు విడుదల చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ శాఖ పరిధిలో మల్టీపర్పస్‌ వర్కర్లు (52,473), సెర్ప్‌ ఉద్యోగులు (22,011), ఫుల్‌టైం వర్కర్లు (1,349) గ్రామ పంచాయతీల కంప్యూటర్‌ ఆపరేటర్లు (1,301), మండల కంప్యూటర్‌ ఆపరేటర్లు (278), జిల్లా పరిషత్‌ల పార్ట్‌టైం, ఫుల్‌టైమ్‌ వర్కర్లు (171), మండల పరిషత్‌ పార్ట్‌ టైం, కాంట్రాక్ట్‌ పంచాయతీ కార్యదర్శులు (9), జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు (817) పొరుగు సేవల పంచాయతీ కార్యదర్శులు (792), డీపీఎంలు (31), సొసైటీ ఫర్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ సర్వీసెస్‌ (12,586), డీడీయూ జీకేవై (107), ఎస్‌ఎస్‌బీఎం (70), ఎస్‌ఎస్‌ఏఏటీ (180) ఉద్యోగులు మొత్తం 92,175 మంది ఉన్నారు.

– ప్రతి నెలా సకాలంలోనే

వీరికి చాలా కాలం నుంచి సకాలంలో వేతనాలు అందడం లేదు. గతంలో ఆరు నెలల వేతనాలు పెండింగ్‌ పడిన దాఖలాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఉపాధి హామీ ఉద్యోగుల, మల్టీపర్పస్‌ ఉద్యోగులకు మూడు నెలల వేతనాలు రావాల్సి ఉంది. ఈ సమస్యను ఉద్యోగ సంఘాల నేతలు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లారు. ఆమె ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి ఇకపై ప్రతి నెలా సకాలంలో వారికి వేతనాలు చెల్లించాలని నిర్ణయించారు.

– ఆన్‌లైన్‌లో హాజరు వివరాలు

ఆమె ఆదేశాలను ఈ నెల నుంచే అమలు చేసేలా పంచాయతీరాజ్‌ కార్యదర్శి లోకేశ్‌కుమార్, డైరెక్టర్‌ సృజన తదితర ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి నెలా 25 వరకు ఆన్‌లైన్‌ ద్వారా ఉద్యోగుల పని దినాల వివరాలు సేకరించి, 26వ తేదీనే బిల్లులు సిద్ధం చేయనున్నారు. ఏకకాలంలో జీతాలు చెల్లిస్తారని పంచాయతీరాజ్‌శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.

Related posts