Praja Kshetram
తెలంగాణ

ఐడియా అదిరిపోయింది..! డీజిల్ మోటార్‌తో స్మార్ట్ ఫోన్ల‌కు ఛార్జింగ్..!!

ఐడియా అదిరిపోయింది..! డీజిల్ మోటార్‌తో స్మార్ట్ ఫోన్ల‌కు ఛార్జింగ్..!!

 

పెద్దేముల్ ఏప్రిల్ 19(ప్రజాక్షేత్రం):గ‌త రెండు రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా భారీ ఈదురుగాలుల‌తో కూడిన వ‌ర్షం కురుస్తున్న సంగ‌తి తెలిసిందే. గాలివాన బీభ‌త్సానికి చాలా ప్రాంతాల్లో భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేల‌కొరిగాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో విద్యుత్ స‌ర‌ఫ‌రాకు తీవ్ర అంత‌రాయం క‌లిగింది. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం తట్టేపల్లి గ్రామంలో రెండు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో త‌ట్టేప‌ల్లి గ్రామంలో క‌రెంట్ స‌ర‌ఫ‌రా నిలిచిపోవ‌డంతో.. తాగునీటికి ఆటంకం ఏర్ప‌డింది. అంతేకాకుండా నిత్యం స్మార్ట్ ఫోన్ల‌లో మునిగి తేలేవారికి విద్యుత్ స‌ర‌ఫ‌రా అంత‌రాయం కాస్త ఇబ్బందిని తెచ్చి పెట్టింది. విద్యుత్ స‌ర‌ఫ‌రా అంత‌రాయంతో స్మార్ట్ ఫోన్ల‌కు ఛార్జింగ్ పెట్టుకోలేని ప‌రిస్థితి. అన్ని ఫోన్లు స్విచ్ఛాఫ్ అయ్యాయి. మ‌రి ఏం చేయాలి.. ఇత‌రుల‌తో క‌మ్యూనికేట్ ఎలా..? టైం పాస్ ఎలా అవుతుంద‌ని ఆలోచించారు. అనుకున్న‌దే త‌డువుగా గ్రామ‌స్తులంద‌రూ చందాలు వేసుకున్నారు. ఒక డీజిల్ మోటార్ కిరాయికి తీసుకొచ్చారు. డీజిల్ స‌హాయంతో ఆ మోటార్‌ను ఆన్ చేసి తాగునీటిని ప‌ట్టుకున్నారు. అదే డీజిల్ మోటార్ ద్వారా స్విచ్ బోర్డుకు విద్యుత్ స‌ర‌ఫ‌రా అయ్యేలా ఏర్పాట్లు చేశారు. ఇంకేముంది.. ఆ స్విచ్ బోర్డు నుంచి పదుల సంఖ్య‌లో సెల్ ఫోన్ల‌కు ఛార్జింగ్ పెట్టుకున్నారు. అనంత‌రం మ‌ళ్లీ ఫోన్ల‌లో బిజీ అయిపోయారు. ఒక్క ఐడియా ప‌దుల సంఖ్య‌లో సెల్‌ఫోన్ల‌కు ఛార్జింగ్ పెట్టుకునేలా చేసింది.

Related posts