వరంగల్ సభతో తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ కు ఇచ్చిన సందేశం ఇదే : కేటీఆర్
– తెలంగాణలో తిరిగి అధికారంలోకి రాబోయేది బీఆర్ఎస్ పార్టీయే
– వరంగల్ సభకు భారీగా తరలివచ్చి తెలంగాణ ప్రజలు చెప్పిన సందేశం ఇదే
– పార్టీ నాయకులు, కార్యకర్తలతో టెలీ కాన్ఫరెన్స్కే లో బిఆర్ఎస్
హైదరాబాద్ ఏప్రిల్ 28(ప్రజాక్షేత్రం):తెలంగాణలో తిరిగి అధికారంలోకి రాబోయేది బీఆర్ఎస్ పార్టీయేనని, వరంగల్ సభకు లక్షలాదిగా తరలివచ్చిన తెలంగాణ ప్రజలు చెప్పిన సందేశం ఇదేనని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. బహిరంగ సభకు లక్షలాదిగా తరలి వచ్చి విజయవంతం చేసిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు. సభను విజయవంతం చేయడంలో కీలక పాత్ర వహించిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. లక్షల సంఖ్యలో ప్రజలు సభకు హాజరై కేసీఆర్ నాయకత్వం పట్ల అచంచలమైన విశ్వాసాన్ని ప్రకటించారని, ఆదివారం సభ ద్వారా బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి రాబోతోందని స్పష్టమైందని అభిప్రాయపడ్డారు.
దేశ రాజకీయ చరిత్రలో అతిపెద్ద బహిరంగ సభల్లో ఒకటిగా ఈ రజతోత్సవ సభ నిలిచిపోతుందని కేటీఆర్ తెలిపారు. పార్టీ ప్రజా బలాన్ని సభ మరోసారి నిరూపించిందని పేర్కొన్నారు. ట్రాఫిక్ నిర్వహణలో రాష్ట్ర పోలీసు యంత్రాంగం విఫలమైనప్పటికీ, లక్షలాది మంది ప్రజలు ముందే సభ ప్రాంగణానికి చేరుకోవడం తెలంగాణ ప్రజల నిబద్ధతకు నిదర్శనమన్న ఆయన, భారీగా ట్రాఫిక్ సమస్యలు ఉన్నప్పటికీ, సభ విజయవంతంగా పూర్తి కావడం గర్వకారణమని తెలిపారు.
వరంగల్ సమావేశం రజతోత్సవ కార్యక్రమాలకు కేవలం ప్రారంభం మాత్రమే అని తెలిపారు. ఇక నుంచి తానే ముందుండి పోరాడతానని కేసీఆర్ ప్రకటించడంతో, భవిష్యత్తులో మరిన్ని ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే తగిన సమయం ఇచ్చామని, ఇకపై ప్రతి అంశంపై ప్రభుత్వాన్ని వెంటాడుతామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసే అరాచకాలు, వారి ప్రచారాలను ఎక్కడికక్కడ ఎదుర్కొని ప్రజల్లో స్పష్టత తీసుకురావాలని, మరింత చురుకుగా ముందుకు సాగాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
– ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు
రాష్ట్ర పార్టీ నాయకులు, శ్రేణులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి, రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున స్పందించి సభ విజయవంతం కావడంలో మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రత్యేక కృషి చేసిన వరంగల్ జిల్లా పార్టీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నేతలు, కార్యకర్తలతో పాటు హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సభా ప్రాంగణం వద్ద గత నెల రోజులుగా నాయకులు, కార్యకర్తలు చేసిన కృషి ఫలితంగానే ఎంతో విజయవంతంగా జరిగిందని ఆయన పేర్కొన్నారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీ కేంద్ర కార్యాలయం వరకు ప్రతి ఒక్కరూ సభ విజయవంతం కావడానికే పని చేశారని కేటీఆర్ అభినందించారు. పక్కా ప్రణాళికతో, ఎలాంటి అవాంతరాలు లేకుండా సభను విజయవంతం చేశామన్న ఆయన, సోషల్ మీడియా వారియర్లు, మీడియా మిత్రులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
