అనర్హులకు ఆహార భద్రత.. పక్కదారి పడుతున్న రేషన్ కార్డులు
– కార్డుల కేటాయింపులలో విచారణ అంతంతే.
– సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు పునాది.
– రేషన్ కార్డుల మంజూరుకి నిబంధనలు ఇవి.
హైదరాబాద్ మే 23(ప్రజాక్షేత్రం):రేషన్ కార్డుల మంజూరుకు సంబంధించి ప్రభుత్వ రెవెన్యూ శాఖ బాధ్యత తీసుకుంటుంది. రెవెన్యూ అధికారులు, సిబ్బంది రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు తీసుకుంటారు. ఆ తర్వాత క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ చేసి కార్డులను కేటాయిస్తారు. ఇక ఏదో విధంగా కార్డులు పొందినవారు పౌరసరఫరాల విభాగం ద్వారా ఏర్పాటైన రేషన్ షాప్ ల ద్వారా సన్నబియ్యం పొందుతారు. ఈ విషయంలో కార్డులు బోగస్ వా ..?, తప్పుడు కార్డులా అనే విషయాన్ని పౌరసరఫరాల విభాగం పట్టించుకోదు. ఒక వేళ ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఫిర్యాదులను రెవెన్యూ శాఖకు పంపిస్తారు. రెవెన్యూ సిబ్బంది క్షేత్రస్థాయిలో ఫిర్యాదులను పరిశీలిస్తే చర్యలు ఉంటాయి. లేకుంటే అంతే సంగతులు. రేషన్ కార్డుల వెరిఫికేషన్ అధికారులు బోగస్, తప్పుడు రేషన్ కార్డులకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. వారిపై అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇవన్నీ పేపర్ లో ఉంటాయి. అమలు కావు. ఫలితంగా అనర్హులు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు గండి కొట్టేస్తున్నారు. సన్న రేషన్ బియ్యాన్ని పొందుతున్నారు. సుమారు 25 శాతం ఆహార భద్రత కార్డులు అనర్హులు పొందుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఇది ఎక్కువగా ఉన్నది. కోట్ల రూపాయల టర్నోవర్ ఉండే వ్యాపారులు, లక్షల రూపాయలు ఆదాయం పొందుతున్న వివిధ వర్గాల వృత్తుల వారు, సాఫ్ట్ వేర్ ఉద్యోగాలతో భారీ వేతనాలు పొందుతున్న వారు సైతం ఆహార భద్రత కార్డుల జాబితాలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.
– కార్డుల కేటాయింపులలో విచారణ అంతంతే
ప్రభుత్వం రేషన్ కార్డుల మంజూరీ లో పొందుపరిచిన నిబంధనల మేరకు కార్డులను కేటాయించాల్సి ఉంటుంది. కాగా కార్డుల మంజూరులో రాజకీయ పలుకుబడి, వివిధ రకాల ఒత్తిడిలు ఎక్కువగా కనిపిస్తాయి. దీంతోపాటు సమగ్ర విచారణ జరగడం లేదు. వెరిఫికేషన్ ఆఫీసర్ కార్డు మంజూరుకి ముందు విచారణ చేయాల్సి ఉంటుంది. సమర్పించిన దరఖాస్తులో పొందుపరిచిన పేర్లను సంబంధించిన పేర్ల ఆదాయ, ఉద్యోగ వివరాలను తనిఖీ చేయాల్సి ఉంటుంది. కానీ ఇది సంపూర్ణంగా జరగడం లేదు.
– సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు పునాది
ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న క్రమంలో ఆహార భద్రత కార్డులను ప్రామాణికంగా తీసుకుంటుంది. ఇందువల్ల ఈ కార్డులు పొందడానికి అనర్హులు ఎందరో ఆరాటపడతారు. పోరాటం చేస్తారు. ఏదోరకంగా వీటిని పొందుతారు. ఆహార భద్రత కార్డులతో ఆరోగ్యశ్రీ పథకాన్ని వినియోగించుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వివిధ రకాల పెన్షన్లను, ఇండ్ల స్థలాలను, స్కాలర్షిప్లు పొందడానికి ఆహార భద్రత కార్డులు ఉపయోగపడతాయి. తాజా ప్రభుత్వం 200 యూనిట్ల కన్న తక్కువగా విద్యుత్ను వినియోగించుకునే వారికి గృహ జ్యోతి పథకాన్ని అమలు చేస్తుంది. గృహ జ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించిన జీరో బిల్ వస్తుంది. ఈ పథకానికి కూడా రేషన్ కార్డు ఉపయోగపడుతుంది. ఒక్క సన్నబియ్యమే కాకుండా వివిధ రకాల ప్రభుత్వ సంక్షేమ పథకాలను వినియోగించుకునే అవకాశం ఉంటుంది.
– రేషన్ కార్డుల మంజూరుకి నిబంధనలు ఇవి
రేషన్ కార్డుల మంజూరిలో ప్రభుత్వం కొన్ని నిబంధనలను విధించింది రూరల్ ప్రాంతవాసులు కు 1.5 లక్షల వార్షిక ఆదాయం పరిమితిని, అర్బన్ ఏరియా లో రెండు లక్షల రూపాయల వార్షిక ఆదాయ పరిమితిని విధించింది. ఇంట్లో ఎవరైనా ఉద్యోగులు ఉంటే వారి ఆదాయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. వారికి ఆహార భద్రత కార్డులు మంజూరు చేయరాదు. అదేవిధంగా తడి భూమి 3.5 ఎకరాల లోపు ఉండవలెను. పొడి భూమి 7.5 ఎకరాల లోపు ఉండవలెను. ఒంటరిగా జీవిస్తున్న మహిళలకు, భూమి లేని, ఇల్లు లేని వారికి, దీర్ఘకాల రోగులకు, వికలాంగులకు అన్నపూర్ణ అంత్యోదయ కార్డులను విడుదల చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు గాని, వారి కుటుంబాలకు గాని ఆహార భద్రత కార్డులు ఇవ్వడానికి వీలు లేదు.