సన్న బియ్యం లబ్ది దారులకు షాకింగ్ న్యూస్ – వారందరి తెల్ల రేషన్ కార్డులు కట్!
– బోగస్ రేషన్ కార్డుల ఏరివేతకు ప్రభుత్వం చర్యలు
– డీలర్ల వారీగా అనర్హుల గుర్తింపు
– ఆరు నెలలుగా రేషన్ తీసుకుని వారి జాబితా సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు
హైదరాబాద్ మే 28(ప్రజాక్షేత్రం):రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం బోగస్ కార్డులు, అనర్హులపై ఫోకస్ పెట్టింది. జిల్లా అధికారులు రేషన్ డీలర్ల వారీగా జాబితాలో అనర్హుల గుర్తింపు ప్రక్రియ మొదలెట్టారు. అలాంటి వారి పేర్లు తొలగించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఇన్ని రోజులు దొడ్డు బియ్యం పంపిణీ చేస్తుండటంతో కొంతమంది లబ్ధిదారులు బియ్యం తీసుకెళ్లడానికి ఇష్టపడేవారు కాదు. ప్రతి పథకానికి రేషన్‌కార్డును ప్రామాణికంగా తీసుకుంటుండటంతో తమ పేరుపై కార్డు ఉంటే చాలని భావించారు. ఇప్పుడు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నా కొందరు తీసుకెళ్లడం లేదని సర్కార్ గుర్తించింది. గత ఆరు నెలలుగా రేషన్ బియ్యం తీసుకోని వారి జాబితా తయారు చేయాలని ఆదేశించడంతో జిల్లా రెవెన్యూ, పౌర సరఫరాల అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేపట్టారు. పెళ్లి చేసుకొని వెళ్లిన వారు, మరణించిన వారు, స్థానికంగా లేని వారిని గుర్తించి, ఏరివేత చేపడుతున్నారు. వచ్చే నెలలో మూడు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేయాలని ఆదేశించడంతో బియ్యం పక్కదారి పట్టుకూడదనే ఉద్దేశంతో రెవెన్యూ, పౌర సరఫరాల శాఖ అధికారులు సంయుక్తంగా చర్యలు చేపట్టారు. క్షేత్రస్థాయిలో సర్వే చేస్తూ లబ్ధిదారులు రేషన్‌కార్డులో ఉన్న చిరునామాలో ఉంటున్నారా అందులో ఎవరైనా మృతి చెందారా? వలస వెళ్లారా? అంటూ ఆరా తీస్తున్నారు. మరి కొందరికి రెండు చోట్ల పేర్లు ఉండటంతో అలాంటి వారి పేర్లు ఒకచోట తొలగిస్తున్నారు. వాటిని పరిగణనలోకి తీసుకొని జూన్‌లో మూడు మాసాలకు సరిపడా కోటాను విడుదల చేయనున్నారు.