రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల జోరు
– 2 లక్షల మైలురాయిని దాటిన ఈవీలు
– 80 శాతానికి పైగా టూవీలర్లు
– పెరుగుతున్న కాలుష్యరహిత వాహనాలు
– ఛార్జింగ్ స్టేషన్లు పెంచితే మరింతగా కొనుగోళ్లు
తెలంగాణ బ్యూరో జూన్ 02(ప్రజాక్షేత్రం):తెలంగాణలో పర్యావరణహిత ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీల) సంఖ్య 2 లక్షల మైలురాయిని దాటింది. 2024-25 ఆర్థిక సంవత్సరం ముగిసే (మార్చి 31) నాటికి రవాణాశాఖ లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 1.96 లక్షలకుపైగా ఎలక్ట్రిక్ వాహనాలు రిజిస్టర్ అయ్యాయి. ఏప్రిల్ నెలాఖరునాటికి ఆ సంఖ్య 2 లక్షలు దాటినట్లుగా రవాణాశాఖ వర్గాలు తెలిపాయి. మొత్తం ఎలక్ట్రిక్ వాహనాల్లో అత్యధికంగా (80 శాతానికిపైగా) బైక్‌లు ఉండగా తర్వాతి స్థానంలో కార్లు ఉన్నాయి. ఈవీలతో అటు వాటి యజమానులతోపాటు ఇటు పర్యావరణానికీ మేలు జరుగుతోంది. పెట్రోల్, డీజిల్ లాంటి శిలాజ ఇంధనాలతో పోలిస్తే ఛార్జింగ్ద్వారా ఖర్చు బాగా ఆదా అవుతోంది.
రాష్ట్రంలో పెరుగుతున్న ఈవీల సంఖ్య
పెట్రోల్, డీజిల్‌తో నడిచేటువంటి వాహనాలతో వెలువడే కర్బన ఉద్గారాలు గాలిని కలుషితం చేస్తాయి. ఈవీలతో ఇలాంటి సమస్యలు ఉండవు. కాలుష్య నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈవీ నూతన పాలసీ సైతం ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్ల పెరుగుదలకు దోహదం చేస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేవారికి రోడ్‌ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజులపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఈ ఉత్తర్వులు 2026 డిసెంబరు 31 వరకు అమల్లో ఉంటాయి. వ్యక్తిగత వాహనాలతోపాటు ఆర్టీసీలోనూ ఈవీలు పెరుగుతున్నాయి.
ఛార్జింగ్ స్టేషన్ల సమస్య
ఈవీలకు ఛార్జింగ్ స్టేషన్ల కొరత సమస్యగా మారింది. హైదరాబాద్‌తోపాటు జిల్లాకేంద్రాలు, జాతీయ రహదారుల్లోని(ఎన్‌హెచ్‌ల) ప్రధాన ప్రాంతాల్లో ఛార్జింగ్ స్టేషన్లున్నాయి. కానీ గ్రామీణ ప్రాంతాలు, సెమీఅర్బన్ ప్రాంతాల్లో ఛార్జింగ్ స్టేషన్ల సమస్య ఉంది. దీంతో ఇప్పటికే ఈవీలు ఉన్నవాళ్లు మార్గంమధ్యలో ఆగి తమ వాహనాలకు గంట, రెండు గంటలపాటు ఛార్జింగ్‌ను పెట్టుకోవాల్సి వస్తోంది. ఈ సమస్య కారణంగా గ్రామీణ, సెమీఅర్బన్ ప్రాంతాలవారు ఈవీ(ఎలక్ట్రిక్ వాహనాల) కొనుగోలుకు తక్కువ ఆసక్తి చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఉన్నవి 800 స్టేషన్లే
ఎలక్ట్రిక్ వాహనాలకు(ఈవీలకు) సంబంధించి ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 800 ఛార్జింగ్ స్టేషన్లు మాత్రమే ఉన్నాయి. దీంతో ఇంటినుంచి బయల్దేరేటప్పుడు పూర్తిగా ఛార్జింగ్ పెట్టి మార్గంమధ్యలో ఎక్కడైనా ఛార్జింగ్పెట్టిస్తే కానీ ఇంటికి చేరుకోగలమన్న నమ్మకం ఏర్పడటం లేదు. క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ-2025లో భాగంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 2030 నాటికి 6,000 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటుచేయాలన్నది లక్ష్యం. 2035 సంవత్సరం నాటికి ఈ సంఖ్య 12,000 పెంచాలని నిర్ణయించారు. ఈ ఏడాది చివరినాటికి ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్యను 3,000 పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ లక్ష్యం చేరితే ఈవీల సంఖ్య భారీగా పెరిగేందుకు ఆస్కారం ఉంటుంది.