ఆ ఎస్సై మామూలోడు కాదుగా.. ఏం చేశాడో తెలిస్తే..
– గంజాయి నిందితుల స్టేషన్ బెయిల్‌కు రూ.2.50 లక్షలు!
– చక్రం తిప్పిన బదిలీ అయిన ఎస్‌ఐ
– విషయం బయటకు పొక్కడంతో కొత్త నాటకం
హైదరాబాద్ జూన్ 03(ప్రజాక్షేత్రం):ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే గంజాయి, నిషేధిత డ్రగ్స్ వాడకం దారులతోపాటు క్రిమినల్స్ పట్ల ఫ్రెండ్లీగా ఉండకూడదు.. కానీ కొందరు పోలీసు అధికారులు దాన్ని తమ అక్రమార్జనకు ఉపయోగించుకుంటున్నారు. డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ వినియోగదారులపై కేసు నమోదు చేసి నోటీసులతోపాటు స్టేషన్ బెయిలివ్వాలి. కానీ, స్టేషన్ బెయిల్ ఇచ్చినందుకు వారి వద్ద ఓ ఎస్సై రూ.2.50 లక్షలు వసూలు చేసిన సంగతి బయటపడింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం బీటెక్ పూర్తి చేసిన నిరుద్యోగి, మరో ఇద్దరు నగర శివారు ప్రాంతంలో గంజాయి తీసుకుంటూ హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (హెచ్‌న్యూ) అధికారులకు పట్టుబడ్డారు. వీరి వద్ద మేలు రకం గంజాయి లభించింది. అది ఎక్కడి నుంచి తెచ్చారో తెలుసుకునేందుకు రెండు రోజుల పాటు విచారించారు. సరైన ఆధారాలు లేకపోవడంతో నిరుద్యోగిని అమ్మకం దారుడిగా, మిగతా ఇద్దరిని వినియోగదారులగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు.
– సీన్‌లోకి వచ్చిన ఎస్‌ఐ
పశ్చిమ మండలంలో సినీ ప్రముఖులు ఉండే పరిధిలోని పోలీసుస్టేషన్‌లో పనిచేసి ఇటీవలే కొత్తగా ఏర్పడ్డ స్టేషన్‌కు బదిలీపై వెళ్లిన ఓ ఎస్‌ఐ రంగంలోకి దిగాడు. కేసును తాను గతంలో పనిచేసిన పోలీసుస్టేషన్‌కు బదిలీ చేయిస్తానంటూ చెప్పాడు. కొంత ఖర్చు అవుతుందని, ఇందుకు సిద్ధంగా ఉండాలని నిందితులతో పేర్కొన్నాడు. విచిత్రంగా శివారులో దొరికిన యువకులను అక్కడి పోలీసుస్టేషన్‌కు కాకుండా ఎస్‌ఐ చెప్పిన ఠాణాకు హెచ్‌న్యూ అధికారులు అప్పగించారు.
అక్కడ నోటీసు ఇచ్చి స్టేషన్ బెయిలు ద్వారా బయటకు తీసుకువచ్చేందుకు రెండున్నర లక్షలు అవుతుందని వసూలు చేశాడు. తమ పిల్లలు బయటకు రావాలని కుటుంబసభ్యులు సరే అన్నారు. పోలీసులు వారికి కొంతసేపటికి నోటీసులు ఇచ్చి పంపించేశారు. ఇది తన వల్లే జరిగిందని చెప్పుకున్న ఎస్‌ఐ రాత్రి రాత్రే నిందితుల నుంచి డబ్బు తీసుకున్నాడు. రెండు రోజుల తర్వాత ఈ విషయం ఠాణా ఇన్‌స్పెక్టర్‌కు తెలిసింది. చట్ట ప్రకారం గంజాయి వినియోగదారులకు నోటీసులు ఇస్తే ఎస్‌ఐకి డబ్బులు ముట్టడం ఏంటని ఆశ్చర్యపోయారు. ఈ సంగతి బయటకు పొక్కడంతో వారికి డబ్బు ఇచ్చేశానని సదరు ఎస్‌ఐ కొత్త నాటకం ప్రారంభించడంతోపాటు ఎవరైనా ఫోన్ చేస్తే స్పందించొద్దని ఆ యువకులను కూడా హెచ్చరించారు. గతంలోనూ సదరు ఎస్‌ఐపై అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి..