Praja Kshetram
తెలంగాణ

ఆసరా పెన్షన్ల పెంపు కోసం మహాగర్జన – మందకృష్ణ మాదిగ

ఆసరా పెన్షన్ల పెంపు కోసం మహాగర్జన – మందకృష్ణ మాదిగ

 

– ఆగస్టు 13న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో “మహాగర్జన”

 

హిమాయత్ నగర్ జులై 03(ప్రజాక్షేత్రం):వికలాంగులు, ఆసరా పెన్షన్ దారుల కోసం ప్రభుత్వం హామీ ఇచ్చిన పెన్షన్ పెంపును అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, వచ్చే ఆగస్టు 13న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో “మహాగర్జన” పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్టు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్), వికలాంగుల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ వెల్లడించారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్లు పెంచాల్సిందే. లక్షల మంది ఆసరా, వికలాంగుల పెన్షనుదారులను సమీకరిస్తాం. మహాగర్జనతో హైదరాబాద్ రహదారులను దిగ్బంధిస్తాం. ఆగస్టు 15 నుంచి 20 మధ్యలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. అందులోపే వికలాంగులకు రిజర్వేషన్లు కల్పిస్తూ ఆర్డినెన్స్ జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం,” అన్నారు. మంద కృష్ణ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరించారు. “ఇంకా మొండితనం కొనసాగితే, ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం” అని పేర్కొన్నారు. మహాగర్జన ద్వారా తమ ఆవేదనను రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టంగా తెలియజేస్తామని, తమ హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని తెలిపారు.

Related posts