Praja Kshetram
తెలంగాణ

మాదాపూర్లో ఒక్కడే రూ.400 కోట్ల విలువైన భూమిని కబ్డా చేశాడు

మాదాపూర్లో ఒక్కడే రూ.400 కోట్ల విలువైన భూమిని కబ్డా చేశాడు

 

– మాదాపూర్లో అక్రమనిర్మాణాలు నేలమట్టం

– కబ్జాకు గురైన పార్కులు, అక్రమణదారుల చెర నుంచి రోడ్డును కాపాడిన హైడ్రా

– అక్రమంగా వెలిసిన పలు నిర్మాణాల కూల్చివేత

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఆగస్టు 21(ప్రజాక్షేత్రం):రంగారెడ్డి జిల్లాలోని శేరిలింగంప‌ల్లి మండ‌లం మాదాపూర్ ప్రాంతంలోని జూబ్లీ ఎన్‌క్లేవ్‌లో పార్కుల‌తో పాటు రోడ్లను ఆక్రమించి చేపట్టిన పలు నిర్మాణాలను హైడ్రా నేలమట్టం చేసింది. 22.20 ఎక‌రాల్లో సుమారు 100 ప్లాట్లతో అనుమ‌తి పొందిన ఈ లేఔట్‌లో 4 పార్కులుండ‌గా 2 ఆక్రమణకు (దాదాపు 8,500 గ‌జాలు) గుర‌య్యాయి. అలాగే 5,000 గజాల మేర రోడ్డు కూడా క‌బ్జాకు గురైంది. వీటికి తోడు 300ల గ‌జాల ప్రభుత్వ స్థలంలో అక్రమంగా వెలిసిన హోట‌ల్ షెడ్డును కూడా హైడ్రా తొల‌గించింది. ఈ విధంగా మొత్తం 16000 గజాల స్థలాన్ని అక్రమణదారుల నుంచి హైడ్రా కాపాడింది. ఈ ఆస్తుల విలువ సుమారు రూ.400 కోట్ల వరకు ఉంటుంది. 1995లో అనుమ‌తి పొందిన ఈ లేఔట్‌ను 2006లో ప్రభుత్వం రెగ్యుల‌రైజ్ కూడా చేసింది.

ఈ లేఔట్ ప్రకారం జీహెచ్‌ఎంసీకి గిఫ్ట్ డీడ్ చేసిన పార్కులను జైహింద్‌రెడ్డి అనే వ్యక్తి క‌బ్జా చేశారంటూ జూబ్లీ ఎన్‌క్లేవ్ లేఔట్ ప్రతినిధులు హైడ్రా నిర్వహించే ప్రజావాణిలో కంప్లైంట్ చేశారు. దీనిపై క్షేత్రస్థాయిలో సమగ్రంగా విచారించిన హైడ్రా అధికారులు క‌బ్జాలు వాస్తవమే అని నిర్ధరించుకున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు వాటిని గురువారం తొలగించారు. వెనువెంటనే పార్కు స్థలాన్ని హైడ్రా కాపాడినట్లుగా సూచిస్తూ బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. పార్కులు, ప్రభుత్వ స్థలం చుట్టూ ఫెన్సింగ్ను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఆస్తులు కబ్జాకు పాల్పడ్డవారిపై పోలీసు కేసులు పెడుతున్నట్టు హైడ్రా అధికారులు వెల్లడించారు.

హైటెక్ సిటీ నుంచి కొండాపూర్ రహదారికి ఆనుకొని మెటల్ చార్మినార్‌కు ఎదురుగా సుమారు 300 గ‌జాల సర్కారు స్థలాన్ని ఆక్రమించి అనుమ‌తి లేకుండా హోట‌ల్ నిర్మించి అద్దెల‌ను జైహింద్‌రెడ్డి పొందుతున్నాడ‌ని జూబ్లీ ఎన్‌క్లేవ్ ప్రతినిధులు హైడ్రాకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అదే స్థలంలో భారీ ప్రకటనల హోర్డింగ్ కూడా పెట్టి రెండింటి ద్వారా నెల‌కు రూ.4 లక్షల వ‌ర‌కూ ఆదాయాన్ని పొందుతున్నాడ‌ని తెలిపారు. ప్రభుత్వ స్థలంలో హోట‌ల్‌ను నిర్మించి అద్దెను వ‌సూలు చేస్తున్న వైనంపై గ‌తంలో జీహెచ్ఎంసీ(గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్) నోటీసులు కూడా ఇచ్చిన విష‌యాన్ని గుర్తుచేశారు.

2006లో రెగ్యుల‌రైజ్ అయిన లే ఔట్ అక్కడి ప్లాట్ ఓనర్లకు తెలియకుండా త‌ర్వాత‌ ఎలా ర‌ద్దవుతుందని వాపోయారు. యూఎల్‌సీ భూమి అయితే సర్కారుకు చెందుతుంద‌ని మ‌ధ్యలో జైహింద్‌ రెడ్డిది ఎలా అవుతుంద‌ని ఎన్‌క్లేవ్ ప్రతినిధులు హైడ్రా అధికారులకు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఆయనపై చాలావ‌ర‌కు ల్యాండ్ గ్రాబింగ్ కేసులున్నాయ‌ని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే హైడ్రా గురువారం ఆక్రమణలను కూల్చివేసింది. హైదరాబాద్ నగరంలో నీటి వనరులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణకోసం పనిచేస్తున్న హైడ్రా ఇప్పటికే పలు ఆక్రమణలపై ఉక్కుపాదం మోపింది. అక్రమార్కుల చెర నుంచి ప్రభుత్వ స్థలాలను కాపాడింది.

గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరించి, వరద ముప్పులేని నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దాలనేదే హైడ్రా ముఖ్య లక్ష్యమని రంగనాథ్ కొద్ది రోజుల క్రితం వివరించారు. ఈ క్రమంలోనే చెరువులు, నాలాలు, పార్కులు, రహదారులు ఆక్రమణలను నిరోధించి, ప్రజా అవసరాలకు ఉద్దేశించిన స్థలాలను కాపాడేందుకు హైడ్రా అత్యంత ప్రాధాన్యతనిస్తోందన్నారు.

Related posts