మృతదేహాన్ని అడవి మధ్యలోనే వదిలేసిన 108 సిబ్బంది.
అచ్చంపేట సెప్టెంబర్ 19(ప్రజాక్షేత్రం):నాగర్ కర్నూలు జిల్లా నల్లమల లోతట్టు ప్రాంతం లింగాల మండల పరిధిలోని ఈర్ల పెంటకు చెందిన మండ్లి గురువమ్మ(29) అనే మహిళా అనారోగ్యానికి గురికావడంతో గత పది రోజుల క్రితం అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కోసం వెళ్లగా అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం మహబూబ్ నగర్ పంపించారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న గురువమ్మ గురువారం సాయంత్రం మృతి చెందిందని బంధువులు తెలిపారు. మహబూబ్ నగర్ ఆసుపత్రి నుండి 108 వాహనం ద్వారా మృతురాలి గురువమ్మను శుక్రవారం తెల్లవారుజామున తరలిస్తూ శ్రీశైలం జాతీయ రహదారి పరహాబాద్ చౌరస్తా వద్ద అడవిలో మార్గమధ్యంలోనే మృతదేహాన్ని వదిలేశారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈర్లపెంట వారి నివాస గ్రామానికి చేర్చకుండా మార్గమధ్యంలో మృతదేహాన్ని వదిలేయడంతో దిక్కుతోచని స్థితిలో కుటుంబ సభ్యులు ఉండిపోయారు. బాధిత బంధువులు అమాయక ఆదివాసీ బిడ్డలు అంటే అంత చులకనా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయంలో మేము నిద్రలో ఉండగా మృతదేహాన్ని ఇలా అడవిలో వదిలి వెళ్ళడం ఏంటని చెంచుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఐటీడీఏ అధికారులకు శుక్రవారం ఉదయం నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేసినా సమాధానం లేకపోవడంతో ఆటోలో తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెంచులు తెలిపారు.
