“జర్నలిస్టుల మహా ధర్నా విజయవంతం”
– జర్నలిస్టుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్
– రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన జర్నలిస్టులు
– నినాదాలతో హోరెత్తిన సమాచారశాఖ కమిషనర్ కార్యాలయం
– మహా ధర్నాలో పాల్గొన్న వయోదిక జర్నలిస్టుల సంక్షేమ సంఘం నాయకులు
హైదరాబాద్ డిసెంబర్ 03(ప్రజాక్షేత్రం):తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలని, జర్నలిస్టుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టియుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరహత్ అలీ, ప్రధాన కార్యదర్శి రామ్ నారాయణ డిమాండ్ చేశారు. బుధవారం టియుడబ్ల్యూజే ఐజేయూ ఆధ్వర్యంలో హైదరాబాద్, మాసబ్ ట్యాంక్ లోని సమాచార శాఖ కార్యాలయం వద్ద జరిగిన మహాధర్నా విజయవంతం అయిందని వారు పేర్కొన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున జర్నలిస్టులు తరలివచ్చారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులంతా తరలివచ్చి ధర్నాలో పాల్గొన్నారని, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అయ్యిందని, అయినప్పటికీ కొత్త అక్రిడియేషన్ కార్డులు ఇవ్వడం లేదని, ఇళ్ల స్థలాల సమస్య పరిష్కరించడం లేదని హెల్త్ కార్డులను పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. దీనికి తోడు జర్నలిస్టులకు సంబంధించిన కమిటీలను వేయకుండా కాలయాపన చేస్తున్నారని అన్నారు. జర్నలిస్టులను విస్మరించడం తగదన్నారు. గొంతెమ్మ కోరికలను జర్నలిస్టులు కోరడం లేదని గతంలో అమలు చేసిన వాటినే సంపూర్ణ స్థాయిలో అమలు చేయాలని అడగడం తప్పా? అని ప్రశ్నించారు. జర్నలిస్టుల్లో అనేకమంది పేద మధ్యతరగతి వర్గాల వారు ఉన్నారని వారంతా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇబ్బందులు పడుతున్న సంగతిని గుర్తించాలన్నారు ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలని మహా ధర్నా ద్వారా వారు మేల్కొవాలని చెప్పారు. తక్షణమే హెల్త్ కార్డులను మంజూరు చేయాలని కొత్త అక్రిడేషన్ కార్డులను ఇవ్వాలని ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
