నడిరోడ్డుపై రియల్టర్ దారుణహత్య.
కాప్రా, డిసెంబర్ 08(ప్రజాక్షేత్రం):నగరాన్ని కుదిపేసిన దారుణ హత్య మేడ్చల్ జిల్లా కాప్రా మండలం జవహర్‌నగర్‌లో చోటుచేసుకుంది. ఫోస్టర్ బిల్లాబాంగ్ స్కూల్ సమీపంలో సోమవారం ఉదయం దుండగులు రియల్టర్ వెంకట రత్నం(50)పై అమానుషంగా దాడి చేశారు. స్థానికుల వివరాల ప్రకారం— బైక్‌పై వెళ్తున్న రత్నపై ముందే పథకం వేసుకున్న దుండగులు కాపు గాసి దాడి చేసినట్లు తెలుస్తోంది. ఆటోలో వచ్చిన దుండుగులు బైక్ ఛేజ్ చేస్తూ మొదట వేటకత్తులతో నరికి, తరువాత గన్‌తో కాల్చి హతమార్చారు. ఘటనను చూసిన వారంతా భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న జవహర్‌నగర్ పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుడైన వెంకట రత్నం పేరు దులుపేట పోలీస్ స్టేషన్లో రౌడీషీటర్‌గా ఉందని, గతంలో జంట హత్య కేసులో కూడా నిందితుడిగా పేరు వచ్చినట్లు ప్రాథమిక సమాచారం. వ్యక్తిగత వైరం లేదా ప్రత్యర్థుల పగే ఈ హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రాంతమంతా ఉద్రిక్తత నెలకొనగా, నిందితుల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చేపట్టినట్లు సమాచారం.
