సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయి పరిశీలన
– మిత్ర హిల్స్‌లో నార్నె శ్రీనివాసరావు పాదయాత్ర
కూకట్ పల్లి, డిసెంబర్ 27(ప్రజాక్షేత్రం):డివిజన్‌లో అత్యవసరంగా పరిష్కరించాల్సిన ప్రాంతాలకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని నార్నె శ్రీనివాసరావు స్పష్టం చేశారు. శనివారం హైదర్‌నగర్ డివిజన్ పరిధిలోని మిత్ర హిల్స్ కాలనీలో నెలకొన్న పలు ప్రజా సమస్యలు, చేపట్టవలసిన అభివృద్ధి పనులపై కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు కాలనీ వాసులు, సంబంధిత శాఖల అధికారులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. హైదర్‌నగర్ డివిజన్ పరిధిలోని మిత్ర హిల్స్ కాలనీలో గల డ్రైనేజీ, పారిశుధ్యం, తాగునీరు, హార్టికల్చర్, వీధిదీపాలు, విద్యుత్ సరఫరా వంటి మౌలిక వసతుల సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు కాలనీ వాసులతో కలిసి పాదయాత్ర చేపట్టారు. ఈ పర్యటనలో జిహెచ్ఎంసి ఇంజనీరింగ్, శానిటేషన్, హార్టికల్చర్, జలమండలి, వీధిదీపాలు, విద్యుత్ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని, వాటిని తక్షణమే పరిష్కరించేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. చిన్న సమస్యగా భావించకుండా ప్రతి అంశంపై చర్చించి, వెంటనే పరిష్కారం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. అదేవిధంగా పలు కాలనీల నుంచి ప్రజల నుంచి వచ్చిన వినతులు, తమ దృష్టికి వచ్చిన సమస్యలను పరిగణలోకి తీసుకొని డివిజన్‌లో అత్యవసరంగా పరిష్కరించాల్సిన ప్రాంతాలకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని నార్నె శ్రీనివాసరావు స్పష్టం చేశారు. నిత్యం సమస్యలతో ఇబ్బంది పడుతున్న ప్రాంతాల్లో ప్రత్యేక చొరవతో పనులు చేపడతామని హామీ ఇచ్చారు. కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ, ప్రజలకు స్వచ్ఛమైన, ఆహ్లాదకరమైన వాతావరణం అందించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. అన్నివేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ, మెరుగైన ప్రజా జీవనానికి అవసరమైన అన్ని రకాల సదుపాయాల కల్పనకు తనవంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు. హైదర్‌నగర్ డివిజన్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, ఆదర్శవంతమైన అగ్రగామి డివిజన్‌గా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ వర్క్ ఇన్‌స్పెక్టర్ మహదేవ్, హార్టికల్చర్ విభాగం అధికారి దాసు, శానిటేషన్ విభాగం రమేష్, వీధిదీపాల విభాగం సుధాకర్, జలమండలి సూపర్వైజర్ నరేంద్ర, సునీల్, విద్యుత్ లైన్‌మన్ పాండు, కాలనీ నాయకులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
