రుద్రారం లో అక్రమ ఎర్రమట్టి రవాణాపై ఎమ్మార్వోకు వినతిపత్రం
– సీఐకి సమాచారం… తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్.
షాబాద్ జనవరి 6( ప్రజాక్షేత్రం):రంగారెడ్డి జిల్లా, షాబాద్ మండలం రుద్రారం గ్రామంలో జరుగుతున్న అక్రమ ఎర్రమట్టి రవాణాపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అధికారులకు వినతులు అందాయి. గ్రామ పరిధిలో ప్రభుత్వ అనుమతులు లేకుండా ఎర్రమట్టి తవ్వకం, రవాణా జరుగుతోందని ఆరోపిస్తూ ఎమ్మార్వో గారికి లిఖిత వినతిపత్రం సమర్పించారు. అక్రమ రవాణా వల్ల పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటోందని, గ్రామ రహదారులు ధ్వంసమవుతున్నాయని, ప్రజల భద్రతకు ముప్పు ఏర్పడుతోందని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై వెంటనే తనిఖీలు నిర్వహించి, వాహనాలను సీజ్ చేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అదే సమయంలో ఈ అక్రమ ఎర్రమట్టి రవాణా వ్యవహారంపై సంబంధిత సీఐ గారికి కూడా పూర్తి సమాచారం అందించి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. రెవెన్యూ, పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేసి అక్రమ రవాణాకు పూర్తిగా అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని, లేకపోతే ప్రజా ఉద్యమాలు చేపడతామని హెచ్చరికలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్రమ ఎర్ర మట్టి రవాణాను వెంటనే అరికట్టాలని కోరుతూ బీసీ సేన షాబాద్ మండల యువజన అధ్యక్షుడు బండ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఎమ్మార్వో గారికి లిఖిత వినతి పత్రం అందజేయడం జరిగింది అలాగే అక్రమ రవాణా వ్యవహారంపై సంబంధిత సీఐ గారికి కూడా పూర్తి వివరాలు తెలియజేసి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బండి దయాకర్, కావాలి మాణిక్యం, చెవిటి రవి, అల్లవాడ భరత్, బండి ప్రశాంత్ పాల్గొన్నారు. అధికారులు వెంటనే స్పందించకపోతే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు.
