హైదరాబాద్ మే 08(ప్రజాక్షేత్రం):
ఉప్పల్ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ సంచలన విజయం సాధించింది.
ప్రత్యర్థి జట్టు నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని ఒక్క వికెట్ కోల్పోకుండానే కేవలం 9.4 ఓవర్లలోనే (167) ఛేధించింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (28 బంతుల్లో 75), ట్రావిస్ హెడ్ (30 బంతుల్లో 89) వీరబాదుడు బాదడం వల్లే.. సన్‌రైజర్స్ ఈ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేయగలిగింది.
SRH ఇంత వేగంగా ఛేజ్ చేయడం ఐపీఎల్ చరిత్రలో ఇదే మొదటిసారి.
తొలుత టాస్ గెలిచి బ్యాటిం గ్ చేసిన లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఆయుష్ బదోనీ (55), నికోలస్ పూరన్ (48) మెరుపులు మెరిపించడం వల్లే.. లక్నో ఆ గౌరవప్రద మైన స్కోరు చేయగలిగింది.
ఇక లక్ష్య ఛేధనలో భాగం గా.. SRH 9.4 ఓవర్లలో 167 పరుగులు చేసి గెలుపొందింది. క్రీజులో అడుగుపెట్టినప్పటి నుంచే అభిషేక్, ట్రావిస్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. లక్ష్యం చిన్నదే అయినప్పటికీ.. దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించారు.
ఎడాపెడా షాట్లతో భారీ బౌండరీలు బాదుతూ.. ముచ్చెమటలు పట్టించారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ప్రత్యర్థి జట్టుకి చుక్కలు చూపించేశారుఎలాంటి వ్యూహాలు పన్నినా, క్లిష్టతరమైన బంతులు వేసినా.. వాళ్లిద్దరూ ఏమాత్రం తడబడకుండా ఊచకోత కోశారు.
బౌలర్లపై కనికరం చూప కుండా విరుచుకుపడ్డారు. పోటాపోటీగా బౌండరీల వర్షం కురిపించారు. అటు లక్నో బౌలర్లు కూడా వారిని కట్టడి చేయలేకపోయారు. వాళ్లు బాదుతున్న బాదుడికి ఒత్తిడికి లోనై.. భారీగా పరుగులు ఇచ్చేస్తున్నారు.
అందుకే.. ఓపెనర్లిద్దరే పది ఓవర్లలోపు లక్నో లక్ష్యాన్ని ఛేధించేసి, తమ హైదరా బాద్ జట్టుకి రికార్డ్ విజయాన్ని తెచ్చిపెట్టారు…