8 సీట్లలో బీజేపీని గెలిపిస్తున్న బీఆర్ఎస్..!
హైదరాబాద్ మే 18 (ప్రజాక్షేత్రం): తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా క్రాస్ ఓటింగ్ జరిగిందనే వార్తలు వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలకు వచ్చిన ఓట్ల శాతం ఈ ఎన్నికల్లో పూర్తిగా రివర్స్ అవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఉత్తర తెలంగాణలో ఒకలా.. దక్షిణ తెలంగాణ మరోలా పోలింగ్ జరిగినట్లు తెలుస్తోంది. కొన్ని పార్లమెంట్ నియోజక వర్గాల పరిధిలో కులప్రాతిపధికన ఓటింగ్ జరిగింది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఓట్లు భారీగా క్రాస్ అయ్యాయని చెబుతున్నారు. దాదాపు 10 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఓటర్లు బీజేపీకి క్రాస్ చేశారని సమాచారం. తమ అభ్యర్థికి గెలిచే అవకాశాలు లేవని భావించిన గులాబీ కేడర్.. అక్కడ ఓపెన్ గానే బీజేపీకి తమ ఓట్లు క్రాస్ చేసిందనే ప్రచారం సాగుతోంది. ఈ పరిణామాలతో దాదాపు నాలుగైదు నియోజకవర్గాల్లో ఊహించని విధంగా బీజేపీ విన్నింగ్ రేసులోకి వచ్చిందనే టాక్ వినిపిస్తోంది.
భువనగిరి, మహబూబ్ నగర్, చేవెళ్ల, వరంగల్, జహీరాబాద్, నల్గొండ, పెద్దపల్లి, నిజామాబాద్, ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి క్రాస్ అయ్యాయని చెబుతున్నారు. క్రాస్ ఓటింగ్ భారీగా జరగడంతో కాంగ్రెస్ పార్టీ గెలుపు అవకాశాలకు గండి పడిందని అంటున్నారు. భువనగిరిలో బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేష్ ముందే చేతులెత్తేయడంతో గులాబీ కేడర్ ఓపెన్ గానే బూర నర్సయ్య గౌడ్ కు జై కొట్టింది. భువనగిరి పరిధిలోని చాలా పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 10 గంటల తర్వాత బీఆర్ఎస్ నేతలెవరు కనిపించలేదు. ఇక నల్గొండలోనూ కారు పార్టీ కేడర్ బీజేపీ అభ్యర్థి సైదిరెడ్డికి ఓటేయడంతో అక్కడ బీఆర్ఎస్ మూడో స్థానానికి పడిపోయిందని చెబుతున్నారు. నల్గొండలో కారుకు డిపాజిట్ కష్టమే అంటున్నారు. ఐదు శాతం ఓటు బ్యాంకు ఉన్న బీజేపీకి 35 శాతం ఓట్లు పడ్డాయని కాంగ్రెస్ సీనియర్ నేతలే చెప్పారంటే నల్గొండ జిల్లాలో కమలం క్రేజ్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.మహబూబ్ నగర్ లో బీఆర్ఎస్ ఓట్లు గంపగుత్తగా డీకే అరుణకు పడ్డాయని తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి సొంత ఇలాఖా కావడంతో ఎలాగైనా కాంగ్రెస్‌ను ఓడించాలనే కసితో బీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీకి పని చేశారని అంటున్నారు. బీఆర్ఎస్ క్రాస్ ఓటింగ్ తో పాలమూరులో కాంగ్రెస్ విజయానికి గండి పడిందనే టాక్ వస్తోంది. అంతేకాదు మూడు నెలల్లో ఎమ్మెల్యేల పైన వచ్చిన కొంత వ్యతిరేకత కూడా డీకే అరుణ గెలుపుకు సహకరిస్తుందని కొత్తవాదం మొదలైంది. అసెంబ్లీలో కష్టపడి పని చేసిన కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు ఎమ్మెల్యేల వద్ద పెద్దగా గుర్తింపు లేదని కొంతమంది స్వచ్ఛందంగా బిజెపికి ఓటు వేసినట్టు ఆయా నియోజకవర్గాల్లో జరిగిన అంచనాల్లో తేటతెల్లమైంది. ఇక నాగర్ కర్నూల్ లో కాంగ్రెస్ మల్లు రవి, బీఆర్ఎస్ ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ మధ్య పోటీ ఉంటుందని భావించినా.. చివరి వారం రోజుల్లో బీజేపీ అనుహ్యాంగా పుంజుకుంది. దీంతో పోలింగ్ రోజున బీఆర్ఎస్ ఓట్లు కూడా బీజేపీకి క్రాస్ అయ్యాయని చెబుతున్నారు. చేవేళ్ల పార్లమెంట్ లోనూ కాసానికి కాకుండా కారు పార్టీ కేడర్ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి సపోర్ట్ చేసింది. దీంతో ఇక్కడ కూడా కాంగ్రెస్ విజయావకాశాలకు బ్రేక్ పడిందని సమాచారం. నిజామాబాద్ లో సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పై తీవ్రమైన వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డికి మైనార్టీలు వన్ సైడ్ గా సపోర్ట్ చేశారు. కాని పోలింగ్ రోజున బీఆర్ఎస్ మెజార్టీ ఓట్లు అర్వింద్ కు క్రాస్ కావడంతో అక్కడ బీజేపీకి కలిసి వచ్చిందని అంటున్నారు.
వరంగల్ లో బీజేపీకి ఖచ్చితంగా గెలుస్తుందనే ప్రచారం సాగుతోంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అయిన అరూరి రమేశ్ కు గులాబీ నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయి. అటు కడియం కావ్యను ఓడించాలని కసి ఆ పార్టీ కేడర్ లోఉంది. దీంతో ఆరూరికి వన్ సైడ్ గా కారు పార్టీ ఓట్లు క్రాస్ అయ్యాయని చెబుతున్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో మొదట కొప్పుల ఈశ్వర్ జోరుగా ప్రచారం చేసినా.. గెలిచే అవకాశాలు లేకపోవడంతో చివరలో ఓట్లను బీజేపీకి క్రాస్ చేశారంటున్నారు. ఇక ఆదిలాబాద్ లో మొదటి నుంచి బీఆర్ఎస్ వెనకబడి ఉంది. దీంతో ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని బీఆర్ఎస్ కేడరంతా బహిరంగంగానే బీజేపీకి మద్దతుగా వర్క్ చేసిందని తెలుస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ పెద్దలే క్రాస్ ఓటింగ్ జరిగేలా పావులు కదిపారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ డబుల్ డిజిట్ సాధించకూడదనే భావనతో బీజేపీకి ఓట్లు వేసేలా గులాబీ కేడర్ కు సిగ్నల్స్ వచ్చాయని అంటున్నారు. కూతురికి బెయిల్ కోసం బీజేపీ పెద్దలతో కేసీఆర్ కుమ్మక్కై క్రాస్ ఓటింగ్ చేయించారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.