వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్
శంకర్ పల్లి మే 23 (ప్రజాక్షేత్రం): వర్షాల వల్ల పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శంకర్ పల్లి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ అధ్యక్షతన సిబ్బందితో సమావేశం నిర్వహించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ వర్షాల వల్ల కలిగే సిజినల్ వ్యాధులు రాకుండా ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని చెత్తను తమ మున్సిపల్ పారిశుధ్య సిబ్బందికి అప్పగించాలని సూచించారు. శిథిలావస్థలో ఉన్న గృహములలో ఉండకూడదని, అలాగే విద్యుత్ స్తంభాల దగ్గరకు ఎవరు వెళ్లకూడదని, ప్రజలు అధికారుల, ప్రజాప్రతినిధుల సూచనలు సలహాలు పాటించాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో చెత్త, ప్లాస్టిక్ తో పేరుకుపోయి ఉన్న డ్రైనేజీల వల్ల ఎక్కువగా ఇబ్బందులు వస్తాయని వీటిలో నీరు నిలవకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి కమిషనర్ ఆదేశించారు. అలాగే మరమ్మతులు చేస్తున్న రహదారుల వద్ద గానీ, వివిధ భవనాల వద్ద కానీ ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నందున ఇంజనీరింగ్ అధి కారులు అప్రమత్తంగా ఉండి సూచికలను ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ అంజనికుమార్, రెవిన్యూ ఇన్స్పెక్టర్ జయరాజ్, శానిటరీ ఇన్స్పెక్టర్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్, వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.