కేసీఆర్‌కు తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ఆహ్వానం.. ఆయన వస్తారంటావా?
హైదరాబాద్ మే 31 (ప్రజాక్షేత్రం): మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్ మర్యాదపూర్వకంగా కలిశారు. జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవానికి హాజరు కావాల్సిందిగా కోరారు. సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకే కేసీఆర్ కలిసి ఆహ్వానించినట్లు వేణుగోపాల్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ పంపిన ఆహ్వాన లేఖను కేసిఆర్‌కు అందజేశానన్నారు. 60ఏళ్ల తెలంగాణ కలను సోనియా గాంధీ నెరవేర్చారన్నారు. దశాబ్ది వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తున్నామని, కార్యక్రమానికి కేసీఆర్ హాజరవుతారని ఆసిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తరఫున నిర్వహించే కార్యక్రమాలను ఆయనకు వివరించినట్లు వెల్లడించారు. తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మెుదటిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఈ వేడుకలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కవులు, కళాకారులతో పెద్దఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ముఖ్యంగా ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో నిర్వహించే కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణ నిలవనున్నట్లు పలువురు మంత్రులు, ఎమ్మెల్యే చెప్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రంగురంగుల విద్యుత్ దీపాలు, పూల మొక్కలతో ఆలంకరించారు. జూన్ 2న ఉదయం సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జాతీయ జెండాను సీఎం రేవంత్ రెడ్డి ఎగరవేస్తారు. అనంతరం రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించనున్నారు.
ఈ నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్ ఆహ్వానం పలకడం చర్చనీయాంశమైంది. తెలంగాణ ఇచ్చింది సోనియమ్మే అని కాంగ్రెస్ శ్రేణులు పదేపదే చెప్తుంటారు. ఈ వేడుకలకు సోనియా గాంధీ సైతం వస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆహ్వానం మేరకు దశాబ్ది ఉత్సవాలకు కేసీఆర్ వస్తారో లేదో వేచి చూడాలి.