బియ్యం అక్రమ రవాణాపై కఠిన చర్యలు
-తాండూరు రేషన్ డీలర్ల సమావేశంలో పాల్గొన్న డీఎస్వో రాజేశ్వర్
గోదాం కాంటాలపైనే డీలర్లు బియ్యం తీసుకోవాలి
బియ్యం పంపిణీ పారదర్శకంగా చేపట్టాలి : డీఎస్వో
తాండూరు, జూన్ 1(ప్రజాక్షేత్రం) : బియ్యం అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని, సివిల్ సప్లై వ్యవస్థలో డీలర్ల పాత్ర కీలకమని, ప్రజలకు బియ్యం పారదర్శకంగా పంపిణీ చేయాలని పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారి రాజేశ్వర్ అన్నారు. శనివారం తాండూరు సివిల్ సప్లై గోదాంలో డీఎం సుగుణతో కలిసి గోదాంలో గల బియ్యం నిల్వలు, నాణ్యతను పరిశీలించారు. అనంతరం డీలర్లతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేషన్ డీలర్లు ప్రతీ ఒక్కరు బియ్యం పంపిణీలో సమయపాలన పాటించాలని సూచించారు. అదేవిధంగా షాపుల వద్ద, ఇతర ప్రాంతాల్లో ఎవరైనా బియ్యం కొన్నా.. అమ్మినా సమాచారం ఇవ్వాలని అన్నారు. ఎవరైనా బియ్యం అక్రమ రవాణాకు పాల్పిడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీలర్లు గోదాంలో ఏర్పాటుచేసిన కాంటాలపైనే బియ్యం తీసుకోవాలన్నారు. ప్రతీనెల 1వ తేదీ నుంచి 15 వరకు బియ్యం పంపిణీ చేయాలని, కచ్చితంగా 1వ తేదీనే పంపిణీని ప్రారంభించాలని తెలిపారు. ఈపాస్ మిషన్‌లో ఉన్న బియ్యం నిల్వలు రేషన్ దుకాణంలో ఉన్న నిల్వలు సమానంగా ఉండాలని, వేరియేషన్స్ వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంత్యోదయ కార్డులు కలిగిన డీలర్లు పంచదార డీడీలు కట్టాలని, అంత్యోదయ లబ్ధిదారులకు చక్కెర పంపిణీ చేస్తామన్నారు. ప్రతీనెల రెండు నెలలకు ఒకసారి సివిల్ సప్లై గోదాంలలో సమావేశం నిర్వహిస్తామని, డీలర్ల సమస్యలతో పాటు గోదాంలో నెలకొనే సమస్యలపై రివ్యూ నిర్వహించి పరిష్కరిస్తామని తెలిపారు. బియ్యం అక్రమ రవాణాపై డీలర్లు అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం డీఎం సుగుణ మాట్లాడుతూ ప్రజలకు బియ్యం పంపిణీ చేసేందుకు డీలర్లకు నాణ్యమైన బియ్యాన్ని అందిస్తామని, సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. గోదాంలో కాంటాను లీగల్ మెటరాలజీ అధికారులతో తనిఖీ చేయిస్తామన్నారు. డీలర్లకు ఒక రోజు ముందే బియ్యం పంపిణీ చేస్తామన్నారు. గోదాం ఇన్‌చార్జి రూట్ మ్యాప్ ఏర్పాటు చేసుకొని డీలర్లకు సకాలంలో బియ్యం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో గోదాం ఇన్‌చార్జి రవికుమార్, రేషన్ కార్డు డీలర్ల సంఘం తాండూరు, పట్టణ, యాలాల, బషీరాబాద్ మండలాల అధ్యక్ష, కార్యదర్శులు, రేషన్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు.