అందెశ్రీ పాటలో రెడ్డి పేరు లేదని మిగతా కులాల పేర్లు కూడా తీయించాడు .. రేవంత్ రెడ్డిపై మందకృష్ణ మాదిగ సెటైర్
హన్మకొండ జూన్ 3 (ప్రజాక్షేత్రం): తెలంగాణ రాష్ట్ర గీతంపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ కీలక వ్యాఖ్యలు చేశారు. అందెశ్రీ రాసిన గీతాన్ని మార్చి సారం లేకుండా చేశారని మండిపడ్డారు. కొత్త గీతాన్ని తెలంగాణ సమాజం ఆమోదించదని అన్నారు. సమక్క సారక్క, కొమరం భీమ్ పేర్లను తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కంచర్ల గోపన్నతో సహా కవుల పేర్లు గీతంలో ఏవని ప్రశ్నించారు. ప్రజల గుండెల్లో నిలిచిన సంపూర్ణ గీతాన్నే ఆమోదించాలని డిమాండ్ చేశారు.రేవంత్ రెడ్డి చెప్పినట్టు విని అందెశ్రీ తన గౌరవాన్ని కోల్పోయారని మందకృష్ణ మాదిగ విమర్శించారు. అందెశ్రీ రాసిన పాటలో రెడ్డి ప్రస్తావన లేదని మిగతా కులాల పేర్లను కూడా తీసేయించారని అభిప్రాయపడ్డారు.రాష్ట్ర చిహ్నం నుంచి కాకతీయ తోరణాన్ని ఎందుకు తొలగిస్తున్నారని మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు. సమ్మక్క సారక్కను కాకతీయులు చంపితే.. గిరిజనులను పొట్టన పెట్టుకున్నది కాంగ్రెస్ కాదా అని నిలదీశారు. కాకతీయుల ప్రస్తావన రాష్ట్ర గీతంలో ఎందుకు అని ప్రశ్నించారు. చార్మినార్ మన వారసత్వ సంపద అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నారేష్ మాదిగ,మంద కుమార్ మాదిగ, వేల్పుల సూరన్న, తదితరులు పాల్గొన్నారు.