Praja Kshetram
తెలంగాణ

నీటిట్యాంకులో పదిరోజులుగా శవం.. పట్టించుకోరా.. కాంగ్రెస్ నేతలకు కేటీఆర్ సూటి ప్రశ్న

నీటిట్యాంకులో పదిరోజులుగా శవం.. పట్టించుకోరా.. కాంగ్రెస్ నేతలకు కేటీఆర్ సూటి ప్రశ్న

 

హైదరాబాద్ జూన్ 3 (ప్రజాక్షేత్రం): కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై మరోసారి ట్విట్టర్(ఎక్స్) వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తీవ్ర విమర్శలు గుప్పించారు. రేవంత్ పాలనలో సాగు, తాగునీరు, కరెంట్ సమస్యలు పెరిగిపోయాయని మండిపడ్డారు. ప్రజల ఆరోగ్యాన్ని గాలికొదిలేసి మీనామేషాలు లెక్కిస్తున్నారన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు కష్టాలు తప్పడం లేదని ధ్వజమెత్తారు. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఘోరంగా విఫలమయ్యారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.‘ఇది ప్రజాపాలన కాదు..ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే పాలన.. కోతల్లేని కరెంట్ ఇవ్వలేరు.. కోతకొచ్చిన పంటకు సాగునీళ్లు ఇవ్వలేరు.. కోతులు పడి చనిపోయినా వాటర్ ట్యాంకులను పట్టించుకోరు.చివరికి.. నల్గొండలోని నీటిట్యాంకులో పదిరోజులుగా శవం ఉన్నా నిద్రలేవరు. సాగర్ ఘటన స్మృతిపథం నుంచి చెరిగిపోకముందే.. కాంగ్రెస్ సర్కారులో మళ్లీ అదే నిర్లక్ష్యం.. అదే నిర్లిప్తత.. సురక్షిత మంచినీళ్లు కూడా ఇవ్వలేని సర్కారిది.ప్రజారోగ్యాన్ని పూర్తిగా గాలికొదిలేసిన గలీజు పాలన ఇది. మిషన్ భగీరథ పథకంతో.. దశాబ్దాల తాగునీటి తండ్లాటను తీరిస్తే.. కనీసం నీటిట్యాంకుల నిర్వహణ కూడా చేతకాని అసమర్థ ప్రభుత్వమిది. గుర్తుంచుకోండి.. జలమే జగతికి మూలం.. ఈ సర్కారు తీరు మారకపోతే… జనమే కాంగ్రెస్‌ను తరిమికొట్టడం ఖాయం’’ అని కేటీఆర్ హెచ్చరించారు.

Related posts