పట్లోళ్ల, పట్నం కుటుంబాలకు కలిసిరాని ఎంపీ బరి!
*ఇంద్రారెడ్డి, మహేందర్‌రెడ్డి, కార్తీక్‌రెడ్డి, సునీతారెడ్డిలకు తప్పని ఓటమి*
తాండూరు/ జూన్ 4 (ప్రజాక్షేత్రం): ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రాజకీయలను శాసించిన పట్లోళ్ల, పట్నం ఫ్యామిలీలకు లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం గెలుపు వరించడం లేదు. తాజాగా పట్నం సునీతారెడ్డి ఓటమే ఇందుకు నిదర్శం. హైదరాబాద్ పార్లమెంటు స్థానం నుంచి గతంలో టీడీపీ అభ్యర్థిగా పట్లోళ్ల ఇంద్రారెడ్డి పోటీ చేసి ఓడారు. అన్న టీడీపీ(లక్ష్మీపార్వతి వర్గం) నుంచి మహేందర్‌రెడ్డి హైదరాబాద్ స్థానంలో పోటీ ఓడారు. 2014 ఎన్నికల్లో చేవెళ్ల లోక్‌సభ స్థానం కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసిన పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్‌రెడ్డి నాటి టీఆర్ఎస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజిగిరి స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా వికారాబాద్ చైర్పర్సన్, పట్నం మహేందర్‌రెడ్డి సతీమణి సునీతారెడ్డి పోటీ చేశారు. మంగళవారం వెలువడిన ఫలితాల్లో ఆమె బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ చేతిలో ఓడిపోయారు. దీన్ని బట్టి దివంగత పట్లోళ్ల ఇంద్రారెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డిల ఫ్యామిలీల్లో ఎంపీ స్థానాలకు పోటీచేయడం కలిసిరాలేదని తెలుస్తోంది.
*మహేంద్రుడి నెక్ట్స్ స్టెప్పేంటి?*
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రాజకీయంగా పేరున్న ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డికి ఎదురుగాలి వీస్తోంది. తాజాగా లోక్‌సభ ఎన్నికల్లో ఆయన సతీమణి సునీతారెడ్డి ఓడిపోయారు. జిల్లా బీఆర్‌ఎ్‌సలో తిరుగులేని నేతగా ఉన్న మహేందర్‌రెడ్డి లోక్‌సభ ఎన్నికల సమయంలో తన సతీమణి, కొడుకు రినీ్షరెడ్డిలను కాంగ్రె్‌సలో చేర్చారు. ఆయన మాత్రం పార్టీ కండువా వేసుకోకుండానే కాంగ్రెస్ మద్దతుదారుగా కొనసాగుతున్నారు. మొదట చేవెళ్ల లోక్‌సభ సీటు ఆశించే ఆయన సునీతారెడ్డిని కాంగ్రె్‌సలో చేర్పించారు. అయితే రాజకీయాల్లో అనుకున్నదొక్కటి.. అయినది మరోటి అన్నట్టుగా చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్‌రెడ్డి కాంగ్రె్‌సలో చేరడంతో సునీతారెడ్డి మల్కాజ్గిరి బరిలో నిలిచారు. చేవెళ్ల టి కెట్ అడిగితే మల్కాజిగిరికి మార్చడం వల్లే ఓటమిపాలయ్యారని ఆయన అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీ మారినా ఆయనకు ఫలితం దక్కలేదు. మే 13న తాండూరులో పర్యటించిన మహేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను తాండూరును వీడేది లేదు. ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేస్తా’ అని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల నాటికల్లా ఆయన తాండూరు నియోజకవర్గంపై దృష్టి కేంద్రీకరిస్తారన్న చర్చ సాగుతోంది. ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా మనోహర్‌రెడ్డి ఉన్నారు. మహేందర్‌రెడ్డి ప్రస్తుతం కాంగ్రె్‌సకు అనుకూలంగా కొనసాగుతూ లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రభుత్వ విప్‌గా నియామకం అయ్యారు. భవిష్యత్తులో ఆయన రాజకీయ వ్యూహమేమిటి? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.