Praja Kshetram
జాతీయం

బీజేపీని యూపీలో గెలిపించి.. పరువు దక్కించిన బీఎస్పీ?

బీజేపీని యూపీలో గెలిపించి.. పరువు దక్కించిన బీఎస్పీ?

 

 

లక్నో జూన్ 06 (ప్రజాక్షేత్రం): బీజేపీ తీవ్ర ఎదురుదెబ్బలు తిన్న రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్‌ అత్యంత కీలక పాత్ర పోషించింది. ఇక్కడ బీజేపీకి ఆ మాత్రం పరువు దక్కిందంటే ఆ పుణ్యం మాయావతి నేతృత్వంలోని బీఎస్పీదేనని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీ, ఎస్పీ పొత్తు పెట్టుకుని పోటీ చేశాయి. కానీ.. ఈసారి బీఎస్పీ ఒంటరిగా బరిలో దిగింది. అప్పుడే బీఎస్పీకి దారుణ పరాజయాలు తప్పదని అందరూ ఊహించారు. వాస్తవ ఫలితాలు దానినే రుజువు చేశాయి. అయితే.. ఇక్కడ బీజేపీకి మరింత దారుణ ఫలితాలు రాకుండా అడ్డుకట్ట వేసింది బీఎస్పీయేనని అర్థమవుతున్నది. బీఎస్పీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. అయితే.. 9.39 శాతం ఓట్లను సాధించగలిగింది. ఈ శాతం.. అనేక చోట్ల ఎన్డీయే భాగస్వామ్యపక్షాల మార్జిన్లకంటే ఎక్కువ కావడం విశేషం. బీఎస్పీ చీల్చిన ఓట్లతో బీజేపీ 14 సీట్లలో, దాని భాగస్వామ్య పక్షాలు అప్నాదళ్‌ (సోనేలాల్‌), రాష్ట్రీయ లోక్‌దళ్‌ చెరొక స్థానంలో గట్టెక్కాయి. ఈ పరిస్థితిని ముందే ఊహించిన ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌.. దేశ రాజ్యాంగాన్ని మార్చాలని చూసే, రిజర్వేషన్లను ఎత్తివేయాలని భావించే బీజేపీకి మాయావతి శ్రేణులు ఓటు వేయవద్దని, ఇండియా కూటమికి మద్దతు పలకాలని ఎన్నికల ప్రచారంలో విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. బీజేపీ, దాని మిత్రులు గట్టెక్కిన సీట్లో ఎక్కువ పశ్చిమ యూపీలోనే ఉన్నాయి. అలీగఢ్‌, అమ్రోహా, ఫరూఖాబాద్‌, ఫతేపూర్‌ సిక్రి, షాజహాన్‌పూర్‌, మీరట్‌లలో ఎన్డీయే పక్షాలు బీఎస్పీ చలువ వల్లే గెలిచాయనడంలో సందేహం లేదేమో. అలీగఢ్‌లో ఎస్పీ అభ్యర్థి బీజేపీ చేతిలో 15,647 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక్కడ బీఎస్పీకి 1.23 లక్షల పైచిలుకు ఓట్లు వచ్చాయి. అమ్రోహాలో బీజేపీ కేవలం 28,670 ఓట్లతో కాంగ్రెస్‌ను ఓడించింది. ఇక్కడ బీఎస్పీ 1.64 లక్షలకు పైగా ఓట్లను కైవసం చేసుకున్నది. ఫరూఖాబాద్‌లో బీఎస్పీకి 45,390 ఓట్లు వచ్చాయి. ఇక్కడ ఎస్పీ అభ్యర్థి బీజేపీ చేతిలో 2,678 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఇక ఫతేపూర్‌ సిక్రిలో కాంగ్రెస్‌ను బీజేపీ 43,405 ఓట్ల తేడాతో ఓడించింది. ఈ నియోజకవర్గంలో బీఎస్పీ 1.2 లక్షలకుపైగా ఓట్లు సాధించింది. షాజహాన్‌పూర్‌లో బీఎస్పీకి 91,710 ఓట్లు పడ్డాయి. ఇక్కడ బీజేపీ మార్జిన్‌ 55,379 ఓట్లు. మీరట్‌లో ఎస్పీ అభ్యర్థిని బీజేపీ కేవలం 10,585 ఓట్ల తేడాతో ఓడించింది. ఈ స్థానంలో మాయావతి పార్టీకి 87,025 ఓట్లు లభించాయి.

పశ్చిమ యూపీలోని బిజ్నూర్‌లో బీజేపీ భాగస్వామ్య పక్షం ఆరెల్డీ 37,508 ఓట్ల తేడాతో బయటపడింది. ఇక్కడ బీఎస్పీకి వచ్చిన ఓట్లు 2.18 లక్షలు. అవధ్‌ ప్రాంతంలో నాలుగు సీట్లు.. మిశ్రిఖ్‌, ఉన్నావో, హర్దోయి, అక్బర్‌పూర్‌లలో బీజేపీ అతికష్టం మీద గట్టెక్కింది. ఇక్కడ బీజేపీ మెజార్టీ కంటే బీఎస్పీకి వచ్చిన ఓట్లే ఎక్కువ. మిశ్రిఖ్‌లో బీఎస్పీకి 1.11 లక్షల ఓట్లు రాగా, ఎస్పీపై బీజేపీ మెజార్టీ 33,406 ఓట్లు. ఉన్నావోలో ఎస్పీ అభ్యర్థిని బీజేపీ 55,379 ఓట్ల తేడాతో ఓడించింది. ఇక్కడ బీఎస్పీకి 72,527 ఓట్లు లభించాయి. హర్దోయిలో బీఎస్పీ 1.22 లక్షల ఓట్లు తెచ్చుకోగా.. ఎస్పీపై బీజేపీ మెజార్టీ 27,856 ఓట్లు. అక్బర్‌పూర్‌లో ఎస్పీపై బీజేపీ 44,345 ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. ఇక్కడ బీఎస్పీకి 73,140 ఓట్లు వచ్చాయి.

పూర్వాంచల్‌ ప్రాంతంలో బీజేపీ బన్స్‌గావ్‌, ఫూల్పూర్‌, బధోయి, దియోరాలలో ఇదే పరిస్థితిలో గట్టెక్కింది. బన్స్‌గావ్‌లో బీజేపీ కేవలం 3,150 ఓట్ల తేడాతో పరువు దక్కించుకున్నది. ఇక్కడ బీఎస్పీ 64,750 ఓట్లు సాధించింది. ఫూల్పూర్‌లో ఎస్పీ, బీజేపీ మధ్య హోరాహోరీ పోరులో బీజేపీ 4,332 ఓట్ల తేడాతో విజయం సాధించింది. ఇక్కడ బీఎస్పీకి 82,586 ఓట్లు పోలయ్యాయి. భదోయిలో బీజేపీ చేతిలో టీఎంసీ 44,072 ఓట్ల తేడాతో ఓడిపోయింది. ఇక్కడ బీఎస్పీ ఓటు షేరు 1.55 లక్షలు. దియోరాలో బీఎస్పీకి 45,564 ఓట్లు వస్తే.. కాంగ్రెస్‌ అభ్యర్థిని బీజేపీ 34,842 ఓట్ల తేడాతో ఓడించింది. మీర్జాపూర్‌ సీటులో బీజేపీ మిత్ర పక్షం అప్నాదళ్‌ (సోనేవాల్‌) ఎస్పీ అభ్యర్థిని 37,810 ఓట్ల తేడాతో ఓడించగా.. బీఎస్పీకి అక్కడ 1.44 లక్షల ఓట్లు లభించాయి.

Related posts