నిర్వేదం నీడలో బీఆరెస్ …నాయకుల్లో తీవ్ర అంతర్మథనం
*-కేడర్లో పెరిగిన నిరుత్సాహం*
*-ఎమ్మెల్యేలకు పక్క పార్టీల ఎర*
*-అధికారానికి అలవాటుపడ్డ లీడర్లు*
*-నిస్తేజంగా పార్టీ నిర్మాణం*
*-పక్కచూపుల్లో ముఖ్య నాయకులు*
*-గాలం వేస్తున్న కాంగ్రెస్, బీజేపీ*
ప్రజాక్షేత్రం ప్రత్యేక ప్రతినిధి:బీఆరెస్ పార్టీని పూర్తి నిర్వేదం ఆవరించింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన దెబ్బ నుంచి కోలుకోకముందే వచ్చిన పార్లమెంటు ఎన్నికల్లో మరో దెబ్బపడింది. ఫలితాల్లో పార్టీ పత్తా లేకుండా పోవడంతో కారుమేఘాలు కమ్మేశాయి. జిల్లాల్లో నాయకులను, కేడర్ను నిస్తేజం, నిరాశ, నిస్పృహలు చుట్టుముట్టాయి. ఇప్పుడిప్పుడే ఆ పార్టీ కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. పార్టీ శ్రేణులు ఆయోమయంతో పాటు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. పార్టీ ఉనికి ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారుతుందా? అనే చర్చ రాజకీయ పరిశీలకుల్లో సాగుతోంది. దీని నుంచి ఏ విధంగా గట్టెక్కుతుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
*అధికారానికి అలవాటు పడి*
రెండున్నర దశాబ్దాల బీఆరెస్ ప్రస్థానంలో దశాబ్దన్నర పాటు ఉద్యమరాజకీయాలే సాగాయి. ఈ ఉద్యమకాలంలో ఆందోళనలు, ఎన్నికలు, రాజకీయాలను సమన్వయం చేస్తూ పార్టీ ముందుకు సాగింది. పార్టీలో కొనసాగిన నాయకత్వం ఒక వైపు పార్టీపదవులతో పాటు ఇతర ప్రజాప్రతినిధులుగా అధికారాన్ని, పదవులను అనుభవిస్తూ రాష్ట్ర సాధనలో భాగస్వామ్యమయ్యారు. కొంత ఒత్తిడులు, కేసులు, పోరాటాలతో రాటు దేలిన నాయకత్వం ఏర్పడింది. ఈ రాజకీయ నాయకత్వానికి తక్షణం ఏ పదవి ఆశించకుండా భవిష్యత్తుపై ఆశతో రాష్ట్రం సాధించాలనే బలమైన కాంక్షతో ఏ త్యాగానికైనా సిద్ధమంటూ పోరాడే విద్యార్ధి,యువత తోడైంది. దీంతో ఆటుపోట్లు అడ్డంకులు ఎదురైనా అమరుల త్వాగాల పునాదులపై తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది. ఆ తర్వాత అధికారంలోకి బీఆరెస్ రావడంతో పరిస్థితి మారిపోయింది. ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించినట్లు బీఆరెస్ ఫక్తు రాజకీయ పార్టీగా మారిపోయింది. ఆ క్షణం నుంచి బీఆరెస్ కు పునాదిగా, ఆత్మగా ఉన్న ఉద్యమ కార్యకర్తల్లో కొద్ది మంది అధికార పదవులు పొంది వాటికి అలవాటు పడిపోయారు. ఎక్కువ మంది పునాది స్థాయిలోని కేడర్ పార్టీకి దూరమయ్యారు. ఇతర పార్టీల్లో అన్ని రకాల పదవులు అనుభవించి, ఉద్యమకాలంలో వ్యతిరేకులుగా ఉన్న వారంతా పార్టీలో చేరి పదవులతో నిండిపోయారు. పదేండ్ల అధికారంలో ఇలాంటి వారిదే హవా నడిచిందనే విమర్శలున్నాయి. కొంత మంది మినహా అధికారానికి, పదవులను అలవాటు పడిన నాయకులిప్పుడు పార్టీలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
*ప్రశ్నార్ధకంగా పార్టీ పరిస్థితి*
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఓటమితో నాయకులు, కేడర్ జావగారిపోయారు. 39 స్థానాల్లో గెలిచి బలమైన ప్రతిప్రక్షంగా ఉన్నామని భావించినప్పికీ తాజాగా జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో పరిస్థితి మరింత దిగజారింది. అధికార కాంగ్రెస్ పార్టీకి సమానంగా బీజేపీ 8 ఎంపీ స్థానాల్లో గెలుపొందింది. బీఆరెస్ ఒక్క స్థానంలో కూడా గెలువకపోగా ఖమ్మం, మహబూబాద్ రెండు చోట్ల మాత్రమే రెండవ స్థానంలో మిగిలిన 14 చోట్ల మూడవ స్థానానికి ఒక స్థానంలో నాల్గవ స్థానానికి ఆ పార్టీ చేరిపోయింది. పదికి పైగా స్థానాల్లో పార్టీ అభ్యర్ధులకు డిపాజిట్లు గల్లంతయ్యాయి. వరంగల్, కరీంనగర్ లాంటి చోట్ల మూడవ స్థానానికి పరిమితం కావడం ఆ పార్టీ వర్గాలు జీర్ణించుకోలేక పోతున్నాయి. కొందరు నాయకులు ఈ ఓటమితో ముఖం చాటేస్తున్నారు. ఇప్పటికే నాయకుల మధ్య ఉన్న విభేదాలు మరింత పెరిగాయంటున్నారు. ఒకరు చెబితే మరొకరు వినిపరిస్థితి లేదు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాల కారణంగా ఇది జరిగిందా? బీఆరెస్ అంతర్గతంగా బీజేపీతో కుమ్మక్కయ్యి తమ ఓటు బ్యాంకును మళ్ళించిందా? అనే విమర్శలున్నాయి. కారణమేదైనా పార్టీ పరిస్థితి ఆత్మహత్యా సదృశ్యంగా మారింది. ఫలితాలు రాక ముందు కొంత మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించారు. మెజార్టీ స్థానాల్లో బీఆరెస్ గెలుస్తుందంటూ తన బస్సుయాత్రకువిశేష స్పందన లభించిందని కేసీఆర్ చెప్పడం గమనార్హం. పోలింగ్ ముగిసిన రెండు రోజులకే రైతాంగ సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. ఈ మధ్యలో వచ్చిన గ్రాడ్యుయేషన్ ఉప ఎన్నికల్లో పోటీచేసి విస్తృత ప్రచారం చేశారు. పార్లమెంటు ఫలితాల తర్వాత పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు పార్టీ నాయకత్వం పిలుపునిచ్చినా నాయకులు, శ్రేణులు కదులుతారా? అనే చర్చ సాగుతోంది. పార్టీలో సైతం ఇదే చర్చ సాగుతోంది. పార్టీలో విశ్వాసాన్ని పెంపొందించడం అంత సులువుకాదంటున్నారు. పార్టీలో ఎక్కువ మంది నాయకులు పదవులకు, అధికారానికి అలవాటుపడ్డారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
*అంతర్మథంలో నాయకులు*
అధికారానికి అలవాటు పడిన నాయకులు, ఆ కారణంతో పార్టీలోకి వచ్చిన వారిప్పుడు పక్కచూపులు చూస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీలోకి ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు వలసపోయారు. తాజా పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు జారిపోకుండా కాపాడుకోవడం కష్టమంటున్నారు.అటు అధికార కాంగ్రెస్ తో ఇప్పటికే పలువురు టచ్ లో ఉండగా కొందరు బీజేపీ వైపు కూడా చూస్తున్నట్లు చెబుతున్నారు. ఇక బీఆరెస్ లో ఉన్నప్పుడు ఏకపక్షంగా వ్యవహరించి అడ్డూఅదుపులేకుండా చేసిన కొందరు నాయకులను అధికార కాంగ్రెస్ నుంచి రక్షణ పొందాలంటే బీజేపీయే రక్షణ అనే స్థితిలో ఉన్నారు. పైగా కాంగ్రెస్ లో నాయకులతో గిట్టని వారంతా బీజేపీ లో చేరేందుకు మంతనాలు చేస్తున్నారు. పైగా రానున్నకాలంలో బీఆరెస్ కు ప్రజాదరణ లేకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీచేస్తే గట్టిపోటీ ఇవ్వడంతో పాటు గెలిచే అవకాశాలు కూడా లేకపోలేదనే భావన వ్యక్తం చేస్తున్నారు.
ఈ మేరకు బీజేపీ కూడా ఆ ప్రయత్నాలను ప్రారంభించింది. ఇదిలాఉండగా బీఆరెస్ పార్టీ నిర్మాణం లేక పోవడంతో ఇంతకాలం అధికారంతో కాలం వెల్లదీసిన నాయకులు ఇప్పుడు ఏం చేయాలో తెలియని అయోమయాన్ని ఎదుర్కొంటున్నారు. అధికార కాంగ్రెస్ పై కొట్లాడలంటే నిర్మాణపరంగా పార్టీని అభివృద్ధి చేయాల్సి ఉంది. ఇప్పటికిప్పుడు ఇది సాధ్యమయ్యేపని కాదు. పైగా అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా క్షేత్రస్థాయిలో సమీక్ష జరుగలేదు. సమీక్షిస్తే నాయకత్వలోపాలే వెలుగుచూసే అవకాశం ఉంది. ఆ చిత్తశుద్ధి ప్రధాన నాయకత్వానికి లేదంటున్నారు. ఇదిలా ఉండగా 33 జిల్లాలు కూడా పార్టీ నిర్మాణ స్వరూపాన్ని దెబ్బతీసినట్లు చెబుతున్నారు. ఒక్క నియోజకవర్గం ఒక జిల్లాగా ఉన్న సందర్భంలో నాయకత్వ కలయిక కూడా ఇబ్బందిగా మారినట్లు చెబుతున్నారు. నలువైపుల దాడిలో బీఆరెస్ పరిస్థితి ఆయోమయంగా మారగా నాయకులు, కేడర్ గందరగోళంలో ఉంది. అధినాయకత్వం మాత్రం ఇవన్నీ తమకు కొత్తకాదనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. అప్పటి పరిస్థితులు వేరు ఇప్పటి వేరు పరిస్థితులు వేరంటూ కేడర్ చురకలు వేస్తున్నారు.