Praja Kshetram
పాలిటిక్స్

బీజేపీకి 5 సవాళ్లు!

బీజేపీకి 5 సవాళ్లు!

– మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్‌, ఢిల్లీ, బీహార్‌ అసెంబ్లీలకు ఈ ఏడాదే ఎన్నికలు

– జమ్ముకశ్మీర్‌లోనూ ఎన్నికలు నిర్వహించే చాన్స్‌

– అన్నింటా ప్రాంతీయ పార్టీలదే హవా

– మహారాష్ట్రలో దారుణంగా దెబ్బతిన్న మహాయుతి

– హర్యానాలో పుంజుకున్న కాంగ్రెస్‌

– జర్ఖండ్‌లో ఇండియా, ఎన్డీయే పోటాపోటీ

– రాజ్యసభలో మెజార్టీపై తీవ్ర ప్రభావం

– ఇక్కడ ఇండియా కూటమి సాధించే ఫలితాలే

– కేంద్రంలో బీజేపీని కట్టడి చేసే అస్త్రాలు

– బీజేపీ మలిదశ పతనానికి సూచికలు

 

 

 

 

 

 

న్యూఢిల్లీ జూన్ 15 (ప్రజాక్షేత్రం): 21 సీట్ల మెజార్టీతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి రానున్న రోజుల్లో గడ్డు రాజకీయ పరిణామాలు ఎదురయ్యే అవకాశలు సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికలు ముగియడంతో అన్ని రాజకీయ పార్టీలు ఈ ఏడాది జరుగబోయే ఐదు కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై దృష్టిసారిస్తున్నాయి. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్‌, ఢిల్లీ, బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్నది. వాస్తవానికి ఈ ఏడాది చివరిలోగా జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీకి సైతం ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నది. ఒకవేళ కేంద్రం అక్కడ కూడా ఎన్నికలు జరిపిస్తే.. మొత్తం ఆరు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల రణం మొదలుకానుంది. బీజేపీ ఈ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతినడానికి కాంగ్రెస్‌ బలంగా పుంజుకోవడంతోపాటు.. ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషించాయి. ఈ తరుణంలో మరోసారి ప్రాంతీయ పార్టీలే ఆధిపత్యం చెలాయిస్తున్న రాష్ట్రాల ఎన్నికలు కావడం అధికార కూటమిలో గుబులు పుట్టిస్తున్నది. లోక్‌సభ ఎన్నికల్లో జాతీయ అంశాలే ప్రాధాన్యం చూపుతాయనే అభిప్రాయాల నేపథ్యంలో ప్రాంతీయ పార్టీలు తమ దెబ్బను ఎన్డీయేకు రుచిచూపించాయి. ఇప్పుడు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఎన్డీయే కష్టకాలాన్నే ఎదుర్కొనబోతున్నదని విశ్లేషకులు చెబుతున్నారు. అదే జరిగితే.. దేశంలో బీజేపీ పతనం రెండో దశ మొదలైనట్టేనని అంచనా వేస్తున్నారు.

 

*అక్టోబర్‌లో హర్యానా, మహారాష్ట్ర షెడ్యూల్‌*

 

హర్యానా, మహారాష్ట్ర ఎన్నికలకు ఈ ఏడాది అక్టోబర్‌లో షెడ్యూలు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే.. సుమారు నాలుగు నెలల్లోనే ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ సమరం మొదలవుతుంది. నిరాశాజనక ఫలితాలు సాధించిన ఎన్డీయేకు, ఆశాజనక ఫలితాలు సాధించిన ఇండియా కూటమికి లోక్‌సభ ఎన్నికల తర్వాత తొలి పరీక్ష ఈ ఎన్నికలే. ఈ రాష్ట్రాల్లో మహారాష్ట్ర, హర్యానాలో ఎన్డీయే అధికారంలో ఉన్నది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, ఎన్డీయే పక్షాలు ఘోర పరాజయాలు చవిచూశాయి. హర్యానాలో 2019లో బీజేపీ మొత్తం పది సీట్లు గెలుచుకోగా.. 2024 ఎన్నికల్లో అవి సగానికి పడిపోయాయి. ఐదు సీట్లను కాంగ్రెస్‌ గెలుచుకున్నది. మహారాష్ట్రలో కూడా ప్రతిపక్ష మహా వికాస్‌ అఘాడీ (ఎంవీఏ) రాష్ట్రంలోని మొత్తం 48 సీట్లకుగాను 30 సీట్లు గెలుచుకున్నది.

ఎన్డీయేలో భాగమైన అధికార మహాయుతి కూటమి 17 సీట్లతో సరిపెట్టుకున్నది. గత లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే ఇక్కడ 43 సీట్లను గెలుచుకున్నది. ఐదు స్థానాలను అప్పటి యూపీఏ కూటమి దక్కించుకోగలిగింది. లోక్‌సభ ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికలకు ఓటింగ్‌ తీరు మారుతుందనే అభిప్రాయాలు ఉన్నా.. లోక్‌సభ ఎన్నికల ఫలితాల ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలో 288 స్థానాలు ఉన్నాయి. హర్యానాలో 90 సీట్లు ఉన్నాయి. హర్యానాలో కాంగ్రెస్‌ పుంజుకున్నది. లోక్‌సభ ఎన్నికలకు ముందు అధికార బీజేపీ ప్రభుత్వానికి ముగ్గురు స్వతంత్ర సభ్యులు మద్దతు ఉపసంహరించడంతో ముఖ్యమంత్రి నాయబ్‌సింగ్‌ సైని ప్రభుత్వం సంక్షోభంలో చిక్కుకున్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో హర్యానాలో బీజేపీ ఏకైక పెద్ద పార్టీగా అతరించినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల స్థాయిలో సీట్లు గెల్చుకోలేక పోయింది. దీంతో ఎన్నికల అనంతరం జననాయక్‌ జనతా పార్టీ (జేజేపీ), ఏడుగురు స్వతంత్రుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ ముఖ్యమంత్రిగా, జేజేపీ అధ్యక్షుడు దుష్యంత్‌ చౌతాలా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. తదనంతర పరిణామాల్లో ఖట్టర్‌ రాజీనామా, లోక్‌సభ ఎన్నికలకు ముందు సంకీర్ణం నుంచి చౌతాలా నిష్క్రమణతో ప్రభుత్వం మైనారిటీలో పడింది. దానికి తోడు ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మళ్లీ పుంజుకున్నది. మహారాష్ట్రలో కూడా ఎన్డీయేలో భాగమైన మహాయుతి తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నది. మోదీ 3.0 ప్రభుత్వ ప్రమాణానికి కొద్ది గంటల ముందు ప్రఫుల్‌ పటేల్‌కు స్వతంత్ర బాధ్యతలపై సహాయ మంత్రి పదవి ఇస్తూ బీజేపీ చేసిన ఆఫర్‌ను ఎన్సీపీ తిరస్కరించింది. ఎన్సీపీ అజిత్‌పవార్‌ చీలికవర్గంలో ప్రఫుల్‌ పటేల్‌ కీలక నేత. గతంలో పటేల్‌ క్యాబినెట్‌ మంత్రిగా ఉన్నారని, ఇప్పుడు సహాయ మంత్రి హోదా ఇవ్వడం ఆయనకు డిమోషన్‌ ఇచ్చినట్టేనని ఎన్సీపీ చెబుతున్నది. మహాయుతిలో అంతర్గతంగా విభేదాలు ఉన్నాయనేందుకు ఇది సంకేతంగా భావిస్తున్నారు. మరోవైపు రెండు పార్టీలను బీజేపీ చీల్చినప్పటికీ.. అటు ఉద్ధవ్‌ సేన, ఇటు శరద్‌పవార్‌ ఎన్సీపీ బలంగా నిలదొక్కుకున్నాయి. బీజేపీ కూటమిని ఓడించాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీకి ఆశలు అడియాసలే అవుతాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

 

*మహారాష్ట్రపై పవార్‌ కేంద్రీకరణ*

 

ఒకవైపు మోదీ నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం ప్రమాణస్వీకారానికి సిద్ధమైన సమయంలో.. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన ఎన్సీపీ (పవార్) అధినేత శరద్‌పవార్‌.. ‘మహారాష్ట్రలో అధికారం మన చేతుల్లోనే ఉండబోతున్నది’ అని చెప్పడం ఇండియా కూటమి సన్నద్ధతకు సంకేతంగా భావిస్తున్నారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం సజావుగా సాగాలంటే.. ఎన్నికలు జరిగే ఐదు (జమ్ముకశ్మీర్‌ను కలుపుకొంటే ఆరు) రాష్ట్రాల్లో ప్రత్యేకించి హర్యానా, జార్ఖండ్‌, మహారాష్ట్రలో రెండింటిలోనైనా విజయం సాధించాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. లేనిపక్షంలో బీజేపీకి పెనుసవాళ్లు తప్పవని అంటున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై తప్పకుండా చూపుతుందని కొందరు ప్రతిపక్ష నేతలు చెబుతుంటే.. బీజేపీ నేతలు ఆ అభిప్రాయాన్ని తిరస్కరిస్తున్నారు. గతంలో ఢిల్లీ, జార్ఖండ్‌ ఫలితాలను ఉదహరిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు, లోక్‌సభ ఎన్నికలకు మధ్య విచక్షణ పాటిస్తున్న ఢిల్లీ ఓటర్లు.. అదే సంప్రదాయాన్ని పాటిస్తే.. ఈసారి ఢిల్లీ కూడా బీజేపీకి దక్కే అవకాశాలు లేవు. ఇక ఉన్నది బీహార్‌ మాత్రమే. ప్రస్తుతం ఎన్డీయే పక్షాన ఉన్న జేడీయూ అధినేత నితీశ్‌కుమార్‌.. ఎప్పుడు ఏం చేస్తారో ఏం కూటమిలో ఉంటారో తెలియని పరిస్థితి. పైగా అసెంబ్లీ ఎన్నికలకు, లోక్‌సభ ఎన్నికలకు మధ్య తేడా చూపే అవకాశాలు లేకపోలేదు. మొత్తానికి రాబోయే అసెంబ్లీ ఎన్నికలు బీజేపీ మనుగుడకు సవాళ్లు విసరనున్నాయి. ఇక్కడ ఫలితాల ప్రభావం రాజ్యసభ ఎన్నికల్లో పడుతుంది. ఇప్పటికే రాజ్యసభలో తగిన మెజార్టీ లేని ఎన్డీయేకు మరిన్ని రాష్ట్రాల్లో ఇండియా కూటమి గెలిచి, రాజ్యసభలో ఆధిక్యం చూపగలిగితే.. బీజేపీని పూర్తిగా కట్టడి చేసేందుకు వీలుకలుగుతుందని అంటున్నారు. అదే జరిగితే.. అది బీజేపీకి రానున్న రోజుల్లో కోలుకోలేని స్థితికి నెట్టివేస్తుందని చెబుతున్నారు.

Related posts