విద్యుత్తు చెల్లింపులు 7వేల కోట్లయితే..6వేల కోట్ల నష్టం ఎలా వస్తుంది ? విద్యుత్తు శాఖ మాజీ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి నిలదీత
-కేసీఆర్‌ను బద్నామ్ చేసేందుకే ప్రభుత్వం దుష్ప్రచారం
-నల్లగొండలో యాదాద్రి ఫ్లాంటు ఏర్పాటును ప్రశ్నిస్తే చెప్పుతో కొడుతాం
-ఎమ్మెల్సీ కోసం కోదండరామ్ అగచాట్లు
-కేసీఆర్ లక్ష్యంగా కాంగ్రెస్, బీజేపీ కుట్రలు
- హైదరాబాద్ జూన్ 18 (ప్రజాక్షేత్రం): ఛత్తీస్‌గఢ్ నుంచి 17వేల మిలియన్ యూనిట్ల విద్యుత్తు కొనుగోలుకు రూ.7వేల కోట్లు చెల్లిస్తే రూ.6 వేల కోట్ల నష్టం ఎలా వస్తుందని విద్యుత్తు శాఖ మాజీ మంత్రి జీ జగదీశ్డ్డి ప్రభుత్వాన్ని, పవర్ కమిషన్‌ను నిలదీశారు. మాజీ సీఎం కేసీఆర్‌ను బద్నామ్ చేసేందుకు లీకులతో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నిజానికి ఛత్తీస్‌గఢ్ విద్యుత్తు ఒప్పందంతో 6వేల కోట్ల కంటే ఎక్కువ లాభం జరిగిందని స్పష్టం చేశారు. లీకులను సమర్థించేలా కొందరితో మాట్లాడించారని ఆయన విమర్శించారు. ఛత్తీస్‌గఢ్‌తో ఒప్పందం లేకపోతే 17 వేల మిలియన్ యూనిట్లకు 17 వేల కోట్లు కట్టాల్సివచ్చేదని చెప్పారు. గత ప్రభుత్వంపై నిందలు వేయడానికి, కేసీఆర్‌పై బురద జల్లాలన్న స్వార్థ రాజకీయంతో విచారణ కమిషన్లు ఏర్పాటు చేశారని ఆరోపించారు. కమిషన్ విచారిస్తున్న నాలుగు అంశాల్లో ఎక్కడా చిన్న తప్పు లేదని, ఒక్క రూపాయి కూడా నష్టం జరగలేదని అర్థమైందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా కమిషన్‌తో మీడియా సమావేశం పెట్టించి, గతంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు మాట్లాడిన మాటలు చెప్పించారని, ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపే ప్రయత్నం చేశారని జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. అందుకే కేసీఆర్ తన లేఖలో అన్ని అంశాలను స్పష్టంగా వివరించారని, దానితో ప్రజలకు అన్ని విషయాలు స్పష్టంగా అర్థమయ్యాయని చెప్పారు. కమిషన్‌కు ఎలాంటి ముందస్తు అభిప్రాయాలు ఉండరాదని, దురదృష్టవశాత్తూ కమిషన్ తన ఉద్దేశాన్ని ముందే బయటపెట్టుకున్నదని ఆక్షేపించారు. వాస్తవానికి జస్టిస్ నరసింహారెడ్డి విచారణకు అంగీకరించి ఉండాల్సింది కాదని అన్నారు. కేసీఆర్ విషయంలో ఏమీ తేల్చలేమని అర్థంకావడంతో ప్రభుత్వం మీడియాకు లీకులు ఇచ్చిందని జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. ఛత్తీస్‌గఢ్ సరిపడా విద్యుత్తు ఇవ్వకపోవడంతో ఎక్కువ ధరకు కొన్నారని, నష్టం జరిగిందని అంటున్నారని, అదే ఉత్తర భారతం నుంచి కరెంట్ తీసుకోకుండా కేసీఆర్ ఫెయిల్ అయితే మళ్లీ తెలంగాణను సమైక్య రాష్ట్రంలో కలపాలన్నది వీరి కుట్ర అని జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలంటే… తెలంగాణ లేకుండా చేయాలని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులు, పదవుల్లో ప్రతి అక్షరంలో కేసీఆర్ పేరు ఉందని చెప్పారు. కేసీఆర్‌కు మసి పూయాలన్న చిల్లర ప్రయత్నం చేస్తున్నారని జగదీశ్‌రెడ్డి విమర్శించారు. దమ్ముంటే సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు విద్యుత్తు కొనుగోళ్లు, ప్లాంట్లపై సాగుతున్న విచారణ అంశాలపై మీడియా సమావేశం పెట్టి ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు. దొంగల లాగా చీకట్లో ముసుగులు వేసుకొని ఎందుకు వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. 6000 కోట్ల నష్టం అన్న కథనాల్లో ప్రతి అక్షరం అబద్ధమేనని అన్నారు. అవినీతి జరిగితే రమణ్ సింగ్, కాంగ్రెస్ సీఎంలకు ఇచ్చారా? చెప్పాలని నిలదీశారు.
*అభివృద్ధి వికేంద్రీకరణకే నల్లగొండలో ప్లాంట్*
నల్లగొండ జిల్లాలో యాదాద్రి విద్యుత్తు కేంద్రం ఎందుకు పెట్టారని ఎవరైనా ప్రశ్నిస్తే చెప్పుతో కొడతామని జగదీశ్‌రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. నల్లగొండ జిల్లా తెలంగాణలో లేదా? కోదండరాంకు నల్లగొండ కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. నల్లగొండ జిల్లా దద్దమ్మ నేతలు నాటి లాగే ఇప్పుడు కూడా నోరెత్తకుండా వ్యవహరిస్తున్నారని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. వనరుల లభ్యత, అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగానే దామరచర్లలో యాదాద్రి ప్లాంట్ ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. నాడు ఛత్తీస్‌గఢ్ నుంచి రూ.3.90 కి యూనిట్ విద్యుత్తు కొనకముందు జార్ఖండ్ నుంచి రూ. 17 రూపాయలకు యూనిట్ విద్యుత్తు కొనుగోలు చేసే పరిస్థితి ఏర్పడేదన్నారు. తమకు ఖర్చు కంటే తక్కువ ఆదాయం వచ్చిందని ఛత్తీస్‌గఢ్ అంటుంటే కేసీఆర్ తెలంగాణకు అన్యాయం ఎట్లా చేశారో చెప్పాలన్నారు. విద్యుత్తు కొనుగోలు, ప్లాంట్ల వివాదంపై కోదండరాం సూటిగా సమాధానం చెప్పాలని, డొంక తిరుగుడుగా మాట్లాడరాదని హితవు పలికారు. చిన్న ఎమ్మెల్సీ పదవి కోసం కోదండరాం పాకులాడుతున్నారని, దొంగలతో చేతులు కలిపి కేసీఆర్ పట్ల ఉన్న ఈర్ష్యను చాటుకుంటున్నారని విమర్శించారు. గతంలో యాదాద్రి విద్యుత్ కేంద్రం బంద్ చేయిస్తామన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి… రోషం ఉంటే ప్రారంభోత్సవానికి పోకూడదన్నారు. బండి సంజయ్ తెలివితక్కువతనం, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ను అరెస్ట్ చేయాలని బీజేపీకి తొందరగా ఉన్నట్లుందని దుయ్యబట్టారు. కాంగ్రెస్, బీజేపీ వేరు కాదని జగదీశ్‌రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ కలిసి పని చేస్తున్నారని ఐదేళ్లుగా చెబుతున్నామని, ఇప్పుడు కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఆ రెండు పార్టీల నేతలు ఒకే రకంగా మాట్లాడుతున్నారన్నారు. హైదరాబాద్‌లో గతంలో విద్యుత్తు కోతలతో లక్షల జనరేటర్లతో వచ్చిన శబ్ద, వాయు కాలుష్యం ఎంత? ఎంత మంది క్యాన్సర్ బారిన పడి ఉంటారో, మణుగూరు విద్యుత్తుతో హైదరాబాద్‌లో విద్యుత్తు కోతలు పోయి జనరేటర్లు బంద్ కావడం వల్ల ఎంత మేలు జరిగిందో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. ఎక్కడో నాలుగు కిలోల బొగ్గు ఎక్కువ అయి పొగ ఎక్కువ వస్తే.. ఇక్కడ లక్షల మంది ఆరోగ్యాలు కాపాడలేదా? అని ప్రశ్నించారు.