సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న కూరగాయల రేట్లు.. సెంచరీ దాటిన టమాట ధర
హైదరాబాద్ జూన్ 20(ప్రజాక్షేత్రం): ‘కూరగాయల మార్కెట్‌కు వెళితే ఆస్తి పేపర్లు పట్టుకోవాల్సి వస్తోంది..’ భారీగా పెరిగిన కూరగాయల ధరలపై ఓ సామాన్యుడు అన్న మాట ఇది. కిలో టమాటలు ఇవ్వుమంటే ఆస్తులు అడుగుతున్నరు.. ఇంకో వినియోగదారుడి ఆవేదన. ఏ కూరగాయ కొందామన్నా రేట్లు చుక్కలు చూపిస్తున్నాయి. నెల రోజుల్లోనే ఒక్కో కూరగాయ రేటు సెంచరీ దాటేసింది. ముఖ్యంగా టమాటల ధరలు బెంబెలెత్తిస్తున్నాయి. ప్రస్తుతం ఏ మార్కెట్‌కు వెళ్లినా కిలో టమాటల ధరల రూ.100కు తక్కువగా ఉండటం లేదు. రైతు బజార్‌లోనే ఏకంగా రూ.70 వరకు పలుకుతోంది. ఏమిటీ కారణం అంటే.. అధిక దిగుబడి తగ్గడమేనని అధికార వర్గాలు చెప్తున్నాయి. పైగా, అవసరానికి తగ్గట్టు సరఫరా కూడా లేదని వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు జోక్యం చేసుకొని కూరగాయల రేట్లను అదుపు చేయాలని ప్రజలు విన్నవిస్తున్నారు. వీలైనంత వరకు ప్రభుత్వమే రైతు బజార్ల ద్వారా విక్రయించాలని కోరుతున్నారు. సరఫరా తగ్గిందన్న సాకుతో మధ్యవర్తులు రేట్లను భారీగా పెంచేసి, అమ్ముతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉల్లి ధర కూడా రూ.60-70కి చేరిందని గుర్తుచేస్తున్నారు.