Praja Kshetram
తెలంగాణ

మాకు బొంద పెట్టుకునే హక్కు లేదా

మాకు బొంద పెట్టుకునే హక్కు లేదా

 

 

రంగారెడ్డి జిల్లా, శంకర్ పల్లి జూన్ 21(ప్రజాక్షేత్రం): శంకర్ పల్లి మండలం కేంద్రలో కొజ్జాగూడ గ్రామ ప్రజలు మాకు బొంద పెట్టుకునే హక్కు లేదా గ్రామస్తులు ప్రశ్నించారు. తరాలుగా ఆ గ్రామంలోని సర్వే నంబర్ 85 లో స్మశాన వాటిక నిర్వహిస్తున్నామన్నారు. ప్రస్తుతం అదే గ్రామానికి చెందిన జొన్నాడ నర్సింలు ఈ భూమి తను కొనుగోలు చేశానని తనదని అంటున్నాడని తెలిపారు. ఇందుకుగాను అక్కడి స్మశాన వాటిక వద్ద గ్రామస్తులు శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామానికి చెందిన వేణుగోపాల్ దొరకు సంబంధించిన భూమిని తరాల కిందట స్మశాన వాటికకు కేటాయిస్తూ మౌఖికంగా తెలిపారని అన్నారు. ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలోని అన్ని కులాల వారు ఇక్కడ స్మశాన వాటిక నిర్వహిస్తున్నారని అన్నారు. 1.16 ఎకరాలకు సంబంధించిన ఈ భూమిని జొన్నాడ నర్సింలు తన పేరున అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, ఇప్పుడు దానిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని విమర్శించారు. రెవెన్యూ రికార్డు (పహాణీ) ల్లో 1955 నుండి ఈ భూమి స్మశాన వాటికగా నమోదు చేయబడి ఉందన్నారు. నర్సింలు తండ్రిని కూడా ఇక్కడే ఖననం చేశారని తెలిపారు. గ్రామంలోని 150 కుటుంబాలకు, 500 మంది జనాభా ఉంటారని, వీరంతా దీనిని ఉపయోగిస్తారని అన్నారు. దీంతో పాటు ఇతర సర్వే నెంబర్లను కూడా అతని పేరున రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని, ఇందులో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడి భవనాలతో పాటు ఒక గుడి కూడా ఉందని తెలిపారు. అతనికి భూమి రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చిన సి.తరుణ్ కుమార్, సిహెచ్. వేణుగోపాల్ రావు లు ఎవరో తమకు తెలియదని అన్నారు. 70, 80 సంవత్సరాల క్రితం మరణించిన వేణుగోపాల్ రావు పేరున ఉన్న ఈ భూమి 2021లో వీరి పేరు పైన ఎలా పట్టా అయిందని ప్రశ్నించారు. ఇది తప్పకుండా అక్రమ రిజిస్ట్రేషన్ అయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. దీనిపైన రెవెన్యూ అధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపించి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సదరు రిజిస్ట్రేషన్ రద్దు చేసి, 85 సర్వే నెంబర్ లోని 1.16 ఎకరాల భూమిని స్మశాన వాటికకు కేటాయించాలని కోరారు. అప్పటివరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

Related posts