కామారెడ్డి జిల్లాలో దారుణం.. మామతో కలిసి భర్తను చంపిన భార్య
హైదరాబాద్ జూన్ 23 (ప్రజాక్షేత్రం): కట్టుకున్న భర్తను మామతో కలిసి హత్యచేసి గుంతలో పూడ్చిపెట్టిన ఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తిర్మలాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. కొద్ది రోజుల కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. తిర్మలాపూర్కు చెందిన రాములు (33) జులాయిగా తిరుగుతుండేవాడు. తాగి వచ్చి భార్య మంజుల, తండ్రి నారాయణను కొడుతూ హింసించేవాడు. దీంతో విసిగిపోయిన వారిద్దరు కలిసి ఈ నెల 9న రాములును హత్య చేశారు. మృతదేహాన్ని రెండు రోజుల పాటు ఇంట్లోని సెప్టిక్ ట్యాంకులో ఉంచారు. అనంతరం ఇంటి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో గుంత తవ్వి పూడ్చిపెట్టారు. గత పది రోజులుగా రాములు కనిపించకపోవడం.. ఇంటి పక్కన ఖాళీ స్థలంలో తవ్విన గుంత అనుమానాస్పదంగా కనిపించడంతో స్థానికులు వారిద్దరిని నిలదీశారు.
దీంతో నిందితులిద్దరూ రాములును హత్య చేసినట్లు చెప్పడంతో శనివారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాన్సువాడ పోలీసులు ఆదివారం ఉదయం ఘటనా స్థలానికి చేరుకుని గుంతను తవ్వగా మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోవడంతో ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.