*రామ్‌లల్లా పైకప్పు నుంచి వాటర్ లీకేజీలో నిజం లేదు.. అయోధ్య టెంపుల్ ట్రస్ట్ వివరణ*
అయోధ్య జూన్ 26 (ప్రజాక్షేత్రం): ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన అయోధ్యలోని రామ్‌లల్లా ఆలయం పైకప్పు నుంచి నీరు కారుతోందంటూ వస్తున్న వార్తలను అయోధ్య టెంపుల్ ట్రస్ట్ తోసిపుచ్చింది. ఆలయ పైకప్పు నుంచి చుక్క నీరు కూడా లీకేజీ కావడం లేదని, ఎక్కడు నుంచి కూడా గర్భగుడిలోకి వర్షపు నీరు ప్రవేశించే అవకాశం లేదని స్పష్టం చేసింది. ఈమేరకు శ్రీ రామ్ జన్మభూమి తీర్ధ్ క్షేత్ర బుధవారంనాడు ఒక ట్వీట్ చేసింది. శ్రీరామ జన్మభూమి ఆలయ నిర్మాణానికి సంబంధించి ఎప్పటికిప్పుడు శ్రీ రామ్ జన్మభూమి తీర్ధ్ క్షేత్ర అధికారిక మీడియా ఇచ్చే సమాచారాన్ని మాత్రమే భక్తులు విశ్వసించాలని కోరింది.
”ఆలయం, పార్క్ కాంప్లెక్స్‌లో రైన్వాటర్ డ్రైనేజీకి సంబంధించి అద్భుతమైన ఏర్పాట్లు చేశాం. ఇందుకు సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి. కాంప్లెక్స్‌లో ఎక్కడూ కూడా వర్షపునీరు నిలవకుండా ఏర్పాట్లున్నాయి. వర్షపు నీటి నిల్వ కోసం రీచార్జి పిట్స్ కూడా నిర్మిస్తు్న్నాం” అని టెంపుల్ ట్రస్ట్ తెలిపింది.
*అయోధ్య రామాలయం పైకప్పు లీక్*
కాగా, రామ్‌లల్లా ముందు పూజారి కూర్చునే స్థలంలో, వీఐపీలు దర్శనం చేసుకునే స్థలంలో నీరు లీక్ అవుతోందని, వానలు ఇలాగే భారీగా కురుస్తుంటే లోపల కూర్చుని పూజ చేయడం కూడా కష్టమేనని ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ గత సోమవారం చేసిన ఆరోపణలను రామ్ టెంపుల్ కన్స్ట్రక్షన్ కమిటీ చైర్మన్ మిశ్రా సైతం తోసిపుచ్చారు. వాటర్ లీకేజీ లేదని, అయితే విద్యుత్ వైర్ల కోసం ఏర్పాటు చేసిన పైపుల నుంచి ఇటీవల కురిసిన వర్షం నీరు కిందకు వచ్చినట్టు తెలిపారు.