Praja Kshetram
క్రైమ్ న్యూస్

కుప్పకూలిన ఎయిర్‌పోర్ట్‌ పైకప్పు.. ఒకరు మృతి, 8 మందికి గాయాలు

కుప్పకూలిన ఎయిర్‌పోర్ట్‌ పైకప్పు.. ఒకరు మృతి, 8 మందికి గాయాలు

 

 

 

ఢిల్లీ జూన్ 28 (ప్రజాక్షేత్రం): దేశరాజధానిలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో టెర్మినల్ 1లో కొంత పైకప్పు భాగం కుప్పకూలింది. కూలిన ప్రాంతం రోడ్డుపై పడటంతో అటుగా వచ్చిన పలు కార్లు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృత్యువాత చెందగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. వెంటనే సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి మూడు ఫైర్ ఇంజన్లను పంపించింది. ఆ క్రమంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు శిథిలాల కింద మరో వ్యక్తి ఉండగా, అతన్ని సురక్షితంగా బయటకు తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే క్షతగాత్రులు ప్రయాణికులా లేదా బయటి వ్యక్తులా అనేది తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెంటనే స్పందించారు. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ టర్మినల్ 1లో పైకప్పు కూలిన ఘటనను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. బాధిత ప్రయాణికులందరికీ సహాయం అందించాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ క్రమంలో చనిపోయిన కుటుంబానికి రూ. 20 లక్షల ఎక్స్ గ్రేషియా, గాయపడిన వారి ఫ్యామిలీకి మూడు లక్షల రూపాయలు మంత్రి ప్రకటించారు. మరోవైపు జూన్ 27న జబల్‌పూర్ ఎయిర్‌పోర్ట్‌లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. దుమ్నా ఎయిర్‌పోర్ట్‌లో కొత్తగా నిర్మించిన ఎయిర్‌పోర్ట్ పైభాగం కూలిపోయి కారుపై పడింది. దీంతో కారు పూర్తిగా దెబ్బతింది. అయితే ఢిల్లీలో ఈ ప్రమాదం వర్షం కారణంగా జరిగిందా లేదా ఇంకేదైనా కారణాలు ఉన్నాయా అనేది కూడా తెలియాల్సి ఉంది. గత రెండు రోజులుగా దేశరాజధానిలో గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఘటన నేపథ్యంలో మిగతా ఎయిర్ పోర్టులు సహా అనేక సంస్థలు, వ్యక్తులు అప్రమత్తంగా ఉండాలి.

Related posts