Praja Kshetram
తెలంగాణ

సీఎం దృష్టికి సమస్యలు

సీఎం దృష్టికి సమస్యలు

 

*-పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క*

*-నల్లమలలో సుడిగాలి పర్యటన*

అచ్చంపేట/మన్ననూర్‌, జూలై 2 (ప్రజాక్షేత్రం): నల్లమల బిడ్డనని గర్వంగా చెప్పుకునే సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి చెంచుల సమస్యలను తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర పంచాయితీ రాజ్‌ శాఖ మంత్రి అన్నారు. అచ్చంపేట నియోజకర్గంలోని అచ్చంపేట, అమ్రాబాద్‌, ఉప్పునుంతల మండలాల్లో సీతక్క మంగళవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హాజీపూర్‌ చౌరస్తాలో పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్రాబాద్‌ మండలం మన్ననూర్‌ వనమాలిక వద్ద పోలీసుల నుంచి సీతక్కతో పాటు ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గౌరవవందనం స్వీకరించారు. పెంటలు, పరిసర గ్రామాల్లో ఉండే చెంచు మహిళలు, ఆదివాసీ నాయకులు, ప్రజాప్రతినిధులతో వనమాలికలోని చెట్ల కింద మంత్రి ముఖాముఖి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మన్ననూరులో 2014లో ఐటీడీఏ ఏర్పాటు చేసినా, రెగ్యులర్‌ పీవో, అధికారులను నియమించలేదన్నారు. దాంతో విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, పక్కా ఇళ్ల నిర్మాణం, కాడెద్దుల పంపిణీ, రోడ్లు, తాగునీరు, డాక్టర్లు, అంబులెన్సులు వంటి సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. పోడు భూములను సాగు చేసుకోనివ్వకుండా అటవీ అధికారులు అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో చెంచుల అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందన్నారు. ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణతో కలిసి నల్లమల ప్రాంత బిడ్డ అయిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి రెండు రోజుల్లో సమస్యలను తీసుకెళ్తానన్నారు. ఐటీడీఏకు రెగ్యులర్‌ పీవోను నియమిస్తామని చెప్పారు. ఆదివాసీలకు పాత భూములను సాగు చేసుకునే హక్కులు కల్పిస్తామని, కొత్తగా అడవిలో చెట్లు నరకడం మానేయాలని చెప్పారు. పోడు భూముల్లో చెంచులు హార్టికల్చర్‌ విధానంలో పండ్ల తోటల పెంచాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీల పోడు భూముల సమస్యను అటవీ శాఖ డీఎ్‌ఫవోలతో సమీక్షించి, సున్నితంగా పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. గతంలో కొందరు ప్రజాప్రతినిధులు ఈ ప్రాంత గుప్తనిధులపైన కన్నేశారని దుయ్యాబట్టారు. ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ, ఆయన సతీమణి, జడ్పీటీసీ సభ్యురాలు డాక్టర్‌ అనురాధ వైద్య వృత్తితో పాటు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్విరామంగా కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ మన్ననూరులో చెంచు విద్యార్థుల కోసం కాలేజ్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీ ఏర్పాటు చేస్తే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాగానే హైదరాబాద్‌కు తరలించిందన్నారు. సీఓఈ కళాశాలను మళ్లీ మన్ననూరుకు తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం అమ్రాబాద్‌ మండలంలోని తెలుగుపల్లి గ్రామంలో నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణతో కలిసి ప్రారంభించారు. రాష్ట్రంలో 30 లక్షల మంది విద్యార్థులకు మహిళా సంఘాల సభ్యులతో యూనిఫామ్‌లు కుట్టించామని చెప్పారు. ఆర్టీసీ బస్టాండ్లు, షాపింగ్‌ మాల్స్‌ వద్ద మహిళా శక్తి క్యాంటిన్లు, మీసేవ కేంద్రాలు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ బదావత్‌ సం తోష్‌, డీఎ్‌ఫఓ, ఐటీడీఏ ఇన్‌ఛార్జి పీఓ రోహిత్‌ గోపిడి, తాజా మాజీ ఎంపీటీసీ దాసరి శ్రీనివాసులు, మాజీ సర్పంచి పెద్దిరాజు, ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు.

*కోటి మందిని కోటీశ్వరులను చేయడమే లక్ష్యం*

మహిళా శక్తి ద్వారా కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క అన్నారు. అచ్చంపేట పట్టణంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలకు చెందిన 514 మహిళా సంఘాలకు రూ.50.10 కోట్ల రుణాల చెక్కులను అందజేశారు. మహిళలు తయారు చేసే వస్తువులను విక్రయించేందుకు హైదరాబాద్‌లోని శిల్పకళా వేదిక వద్ద మహిళ శక్తి వేదికలు ఏర్పాటు చేస్తామన్నారు.

Related posts