పర్యవేక్షకులు లేక బోధన ప్రశ్నార్థకం?
-విద్యార్థుల చదువులపై పట్టింపేదీ?
-ఇన్‌చార్జి ఎంఈవోలతో నెట్టుకొస్తున్న వైనం.
-ఎంఈవోల నియామకాలకు అడ్డంకిగా ఏకీకృత సర్వీస్ నిబంధనల అంశం.
-సర్కారు దృష్టి సారిస్తేనే ప్రభుత్వ పాఠశాలలకు మనుగడ.
వికారాబాద్, జూలై 15(ప్రజాక్షేత్రం): పాఠశాలల్లో విద్యా బోధన ఏ విధంగా కొనసాగుతోంది, విద్యార్థులు చదువులు ఎలా సాగుతున్నాయనేది పరిశీలించేందుకు మండల స్థాయిలో ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికొన్నత పాఠశాలలను మండలవిద్యాధికారులు, ఉన్నత పాఠశాలలను డిప్యూటీ ఈవోలు సందర్శించాలి. ఉపాధ్యాయుల పనితీరు, విద్యార్థుల చదువులను పరిశీలించాల్సిన రెగ్యులర్ మండల విద్యాధికారులు, డిప్యూటీ ఈవోలు లేక పర్యవేక్షణ కొరవడింది. ఏకీకృత సర్వీసు వివాదంతో రాష్ట్రంలో మండల విద్యాధికారులు, డిప్యూటీ ఈవోలు, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ నియామకాలు నిలిచిపోయాయి. రాష్ట్రంలో 2009 పదోన్నతుల అనంతరం మండల విద్యాధికారులు, డిప్యూటీ ఈవోలు నియామకం జరగలేదు. మండల విద్యాధికారులుగా కొనసాగిన వారు ఉద్యోగ విరమణ చేస్తూ రావడంతో ఆ స్థానాల్లో కొత్త నియామకాలు చేపట్టలేదు. ఎంఈవోల స్థానాల్లో మండలంలో సీనియర్ జీహెచ్‌ఎంను ఇన్‌ఛార్జి ఎంఈవోగా బాధ్యతలు అప్పగించారు. జిల్లాలో ఒకే ఒక్క రెగ్యులర్ ఎంఈవో కొనసాగుతుండగా, మిగతా వారంతా ఇన్‌ఛార్జి ఎంఈవోలే కావడం గమనార్హం. సీనియర్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులకు ఇన్‌ఛార్జి ఎంఈవోలుగా బాధ్యతలు అప్పగించి నెట్టుకొస్తున్నారు.
*20 మండలాల్లో ఒక్కరే రెగ్యులర్ ఎంఈవో…*
జిల్లాలో 20 మండలాలు ఉండగా, ప్రస్తుతం తొమ్మిది మంది మాత్రమే మండల విద్యాధికారులు ఉన్నారు. ఒక్కో ఎంఈవోకు రెండు నుంచి మూడు మండలాలకు ఇన్‌చార్జిగా బాధ్యతలు అప్పగించారు. రెగ్యులర్ ఎంఈవో హరిశ ్చంద్ర దోమ, పరిగి, పూడూరు మండలాలకు ఎంఈవోగా వ్యవహరిస్తుండగా, బంట్వారం, కోట్‌పల్లి మండలాలకు చంద్రప్ప, బషీరాబాద్, యాలాల మండలాలకు సుధాకర్‌రెడ్డి, బొంరా్‌సపేట్, కొడంగల్ మండలాలకు రాంరెడ్డి ఇన్‌చార్జి ఎంఈవోలుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వికారాబాద్, ధారూరు మండలాలకు బాబూసింగ్, దౌల్తాబాద్, పెద్దేముల్, తాండూరు మండలాలకు వెంకటయ్య, కులకచర్ల, చౌడాపూర్ మండలాలకు హబీబ్ హమ్మద్, మర్పల్లి మండలానికి విద్యాసాగర్, మోమిన్‌పేట్, నవాబ్‌పేట్ మండలాలకు గోపాల్ ఇన్‌చార్జి ఎంఈవోలుగా వ్యవహరిస్తున్నారు.
*మండలాలు మారినా….*
కాగా, ఇటీవల నిర్వహించిన బదిలీల్లో ఇన్‌చార్జి ఎంఈవోలుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పలువురు జీహెచ్‌ఎంలు మండలాలు మారినాఆ బాధ్యతల్లోనే కొనసాగుతున్నారు. ఇన్‌ఛార్జి ఎంఈవోలు లేని మండలాల్లో అక్కడ పనిచేసే సీనియర్ జీహెచ్‌ఎంలకు ఇన్‌చార్జి ఎంఈవోలుగా బాధ్యతలు అప్పగించే విధంగా చర్యలు తీసుకుంటే పాఠశాలల పర్యవేక్షణ కొంత వరకైనా కొనసాగేది. కాగా, ఈ నిర్ణయానికి నిబంధన లు అడ్డంకిగా మారాయి. 2015లో సీనియర్ జీహెచ్‌ఎంలకు ఇన్‌చార్జి ఎంఈవోలు బాధ్యతలు అప్పగించినా ఆ తరువాత ఉద్యోగ విరమణ, బదిలీలతో ఖాళీ అయిన మండలాల్లో సీనియర్ జీహెచ్‌ఎంలకు ఎంఈవోల బాధ్యతలను అప్పగించలేదు. ఎంఈవోలుగా కొనసాగుతున్న పక్క మండలాల ఎంఈవోలకే ఖాళీ అయిన మండలాల అదనపు బాధ్యతలు అప్పగించారు.
*ఇన్‌చార్జి ఎంఈవోలకు పెరిగిన పనిభారం.*
ఇన్‌ఛార్జి ఎంఈవోలకు తమ పాఠశాల విధులతో పాటు తమకు కేటాయించిన మండలాల ఎంఈవోలుగా బాధ్యతలు నిర్వహించాల్సి వస్తోంది. నివేదికల తయారీ, పాఠ్య పుస్తకాలు, యూనిఫాం దుస్తులు, మధ్యాహ్న భోజనం బిల్లులు, అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు, పాఠశాలల్లో విద్యార్థుల నమోదు, సమావేశాలు, పాఠశాలల పర్యవేక్షణ తదితర పనులు పర్యవేక్షించాల్సి ఉంటుంది. గత నెలలో జరిగిన ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల సందర్భంగా ఉపాధ్యాయుల సీనియార్టీ, ఖాళీల జాబితాలు తయారు చేయడంలో ఎంఈవోలు, సీనియర్ జీహెచ్‌ఎంలు కీలక భూమిక పోషించిన విషయం తెలిసిందే. పాఠశాల జీహెచ్‌ఎంగా విధి నిర్వహణతో పాటు రెండు, మూడు మండలాలకు ఎంఈవోగా బాధ్యతలు నిర్వర్తించాల్సి రావడం వారిపై ఒత్తిడి పెంచుతోంది. పని భారం పెరగడంతో అతి ముఖ్యమైన విద్యా బోధన, విద్యార్థుల చదువుల తీరు పర్యవేక్షించే అవకాశం లేకుండా పోతోంది. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో విద్యార్థుల చదువులు అంతంత మాత్రంగానే కొనసాగుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలపై పర్యవేక్షణ పెరిగేలా విద్యా శాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది.
*కొలిక్కి వస్తేనే…*
ఏకీకృత సర్వీస్ నిబంధనల అంశం అత్యున్నత న్యాయస్థానం పరిధిలో ఉండడంతో ఎంఈవోలు, డిప్యూటీ ఈవోలు, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ నియామకాలు నిలిచిపోయాయి. సీనియర్ జీహెచ్‌ఎంలకు ఎంఈవోలుగా, ఎంఈవోలకు డిప్యూటీ ఈవోలు, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్‌గా పదోన్నతులు కల్పించాల్సి ఉండగా ఏకీకృత సర్వీస్ నిబంధనల అంశం న్యాయస్థానంలో ఉండడం అడ్డంకిగా మారింది. పదోన్నతులు కల్పించే విషయంలో ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో పని చేసే వారి మధ్య వివాదం కొనసాగుతోంది. ఆ అంశం కొలిక్కి రాకపోవడంతో జీహెచ్‌ఎం తరువాత రావాల్సిన పదోన్నతులన్నీ నిలిచిపోయాయి. పదోన్నతుల మార్గం ముందుకు సాగకపోవడంతో ప్రభుత్వ డైట్ కళాశాలల్లో కూడా అధ్యాపకుల పోస్టులు కూడా ఖాళీగా ఉండాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. ఏకీకృత సర్వీస్ నిబంధనల అంశం కొలిక్కి వస్తేనే చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఎంఈవోల పదోన్నతులు, బదిలీలకు మార్గం ఏర్పడుతోంది. ఎంతో ముఖ్యమైన ఈ విషయాన్ని పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు పట్టనట్లు వ్యవహరిస్తుండడం వల్లనే సమస్య జఠిలంగా మారి పాఠశాలలను పర్యవేక్షించే పరిస్థితి లేకుండా పోయిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.