చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు.
-వైసిపి హయాంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం : హోంమంత్రి.
అమరావతి జులై 18(ప్రజాక్షేత్రం): శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చూస్తూ ఊరుకోబోమని, చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్‌లో ఆమె మీడియాతో గురువారం మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో పోలీస్ యంత్రాంగాన్ని తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుని వ్యవస్థను నిర్వీర్యం చేశారన్నారు. రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే శాంతిభద్రతలు అదుపులోకి వస్తున్నాయని తెలిపారు. కొన్ని అరాచక శక్తులు అశాంతిని సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయని, వాటి పట్ల అప్రమత్తంగా వుండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. టిడిపి నాయకులు కూడా సంయమనం పాటించాలని చెప్పారు. రాష్ట్రపతికి, కేంద్ర హోంమంత్రికి రాసే లేఖలో తన బాబారు హత్య కేసు, డాక్టర్ సుధాకర్ హత్యలను ప్రస్తావించాలని వైఎస్ జగన్‌ను కోరారు. డ్రైవర్ సుబ్రమణ్యంను చంపి డోర్ డెలివరీ చేసిన కేసు సహా వివిధ ఘటనలను కూడా ప్రస్తావించాలని అన్నారు. బాలికలు, మహిళలపై అత్యాచార ఘటనలను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ మేరకు పోలీసు, మహిళా శిశు సంక్షేమ శాఖ, విద్యాశాఖలతో స్పెషల్ డ్రైవ్ చేపడతామని తెలిపారు.