బండి సంజయ్ రాజీనామా చేయ్.. మంత్రి పొన్నం సవాల్.
హైదరాబాద్ జులై 19(ప్రజాక్షేత్రం): కేంద్రమంత్రి బండి సంజయ్కు తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మరోసారి సవాల్ విసిరారు. రైతులకు రుణమాఫీ 70 శాతం మందికి వర్తించడం లేదని బండి సంజయ్ అన్నారని.. అది నిరూపించకపోతే తన పదవీకి రాజీనామా చేయాలని మంత్రి పొన్నం డిమాండ్ చేశారు. బండి సంజయ్ రైతులకు తక్షణమే క్షమాపణలు చెప్పాలని అన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తుంటే భరించలేకపోతున్నారా…? అని నిలదీశారు. రైతులకు నల్ల చట్టాలను తెచ్చి అణిచివేసే ప్రయత్నం చేసింది బీజేపీ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు.
*బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రుణమాఫీ ఏది..?*
ఈరోజు (శుక్రవారం) మంత్రి పొన్నం ప్రభాకర్ ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. రైతులకు ఇంతపెద్ద రుణమాఫీ జరుగుతుంటే ప్రశంసించాల్సింది పోయి విమర్శలు చేస్తారా అని ధ్వజమెత్తారు. దేశంలోనే ఒక రైతుకు రూ.2 లక్షల రుణమాఫీ చేసింది తెలంగాణ ప్రభుత్వం మాత్రమేనని.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ స్థాయిలో రుణమాఫీ అమలు చేశారా అని ప్రశ్నించారు.భారీ వర్షాలకు పంట నష్టపోయిన గుజరాత్ రైతులకు వందల కోట్లు కేటాయించిన మీ ప్రభుత్వం తెలంగాణ రైతుల పంటలు నామా రూపాలు లేకుండా కొట్టుకుపోతే కనీసం ఒక్క రూపాయి అయినా విడుదల చేశారా….? అని ప్రశ్నించారు.
*బండి సంజయ్ తీరు విడ్డూరంగా ఉంది.*
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ అమలు చేసిందని అందులో భాగంగా నిన్నటి వరకు లక్ష రూపాయల్లోపు ఉన్న రైతులకు రుణమాఫీ చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. త్వరలోనే లక్షా 50 వేల వరకు , ఆగస్టు లోపు 2 లక్షల రుణమాఫీ పూర్తి చేస్తామని అది ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు.. కానీ కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు కేంద్రమంత్రి బండి సంజయ్ మాట్లాడిన తీరు విడ్డూరంగా ఉందని విమర్శించారు. రైతులకు రేవంత్ ప్రభుత్వం మొత్తం భారతదేశ చరిత్రలోనే 2 లక్షల రుణమాఫీ ఒకేసారి చేస్తుంటుంటే దానిని భరించలేకనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తెచ్చి రైతులకు ఆత్మహత్యలకు కారణమైన ప్రధాని మోదీ ఈరోజు రైతులకు ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం జరుగుతుంటుంటే సమర్థించాల్సింది పోయి.. సమర్థించకపోగా .. విమర్శిస్తున్నారంటే అది సంజయ్ కుహనా బుద్ధి అని అర్థం అవుతుందని అన్నారు. తొలుత కేంద్రం నుంచి రాష్ట్రానికి సంజయ్ ఏం తెస్తారో చెప్పాలని రైతులకు ఏం తెస్తారో తెలంగాణ ప్రజలకు చెప్పాలని అడిగారు. రైతులకు నల్ల చట్టాలను తెచ్చి అణిచివేసే ప్రయత్నం చేసిన మోదీ ప్రభుత్వానికి రైతుల గురించి మాట్లాడే హక్కు ఉందా అని ప్రశ్నించారు.. గుజరాత్లో భారీ వర్షాలు కురిస్తే రూ.100ల కోట్లు కేటాయించిన బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రైతాంగం భారీ వర్షాలకు పంట నామ రూపలేకుండా పోతే పంట నష్ట పరిహారం ఒక్క రూపాయి అయినా విడుదల చేశారా అని ప్రశ్నించారు.
*రైతులకు క్షమాపణలు చెప్పాలి..*
తక్షణమే బండి సంజయ్ రైతులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 2019 బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో 60 ఏళ్లు దాటిన రైతులకు పెన్షన్ ఇస్తామని ప్రకటించారని ఎంతమందికి ఇచ్చారని నిలదీశారు. రైతుల మీద ఫసల్ బీమా. భారాన్ని పెంచారని మండిపడ్డారు. ఎరువుల సబ్సిడీలో రూ. 75 వేల కోట్లు కోత పెట్టారని, కాంప్లెక్స్ ఎరువుల ధరలను రెట్టింపు చేశారని, అగ్రికల్చర్ సెస్ పేరుతో పంట ఖర్చులు పెంచారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ వ్యవహార శైలి చూస్తుంటే గురివింద గింజ నలుపెరుగదు అనే సామెతను గుర్తు చేస్తుందని విమర్శించారు. రైతులకు జరుగుతున్న కార్యక్రమాన్ని ప్రశంసించే ప్రయత్నం చేయాలని.. అంతే తప్ప రైతులకు సంబంధించిన ఈ మంచి కార్యక్రమాన్ని విమర్శించే ప్రయత్నం చేయవద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.