Praja Kshetram
తెలంగాణ

బుచ్చ‌మ్మ ఆత్మ‌హ‌త్య‌తో వెన‌క్కి త‌గ్గిన బుల్డోజ‌ర్.. హైడ్రా కూల్చివేత‌ల‌కు తాత్కాలిక బ్రేక్..

బుచ్చ‌మ్మ ఆత్మ‌హ‌త్య‌తో వెన‌క్కి త‌గ్గిన బుల్డోజ‌ర్.. హైడ్రా కూల్చివేత‌ల‌కు తాత్కాలిక బ్రేక్..

 

 

హైదరాబాద్ సెప్టెంబర్ 28 (ప్రజాక్షేత్రం):ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమ‌లు చేసి చూపిస్తా అన్నంత ఈజీగా.. ఏదో వంద రోజుల్లో మూసీ న‌దిని ప్ర‌క్షాళ‌న చేసేస్తా అన్న‌ట్టు ఈ రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి దూకుడుగా వ్య‌వ‌హ‌రించారు. రాత్రికి రాత్రే స‌ర్వేలు నిర్వ‌హించి.. అక్ర‌మ నిర్మాణాల‌ను గుర్తించాలంటూ అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు. ఇక మార్కులు కొట్టేయాల‌న్న ఆత్రుత‌తో అధికారులు కూడా ఆర్‌బీఎక్స్ పేరిట మార్కులు వేస్తూ చెల‌రేగిపోయారు. పేద‌ల గోడు వినిపించుకోకుండా.. రివ‌ర్ బెడ్ ఏరియా అంటూ రెడ్ మార్క్ వేస్తూ ముందుకు క‌దిలారు. మూసీ న‌ది ప‌రివాహ‌క ప్రాంతాల్లో రెండు రోజుల పాటు ఈ అల‌జ‌డి కొన‌సాగింది. మూసీ బాధితుల ఆర్త‌నాదాల‌ను రేవంత్ స‌ర్కార్ ప‌ట్టించుకోలేదు. వారి గోస‌ను వినిపించుకోలేదు.

కానీ నిన్న రాత్రి సీన్ మారింది. మూసీ ప‌రివాహ‌క ప్రాంతాల్లో శ‌ని, ఆదివారాల్లో భారీ సంఖ్య‌లో కూల్చివేత‌ల‌కు ప్లాన్ చేసిన హైడ్రా వెన‌క్కి త‌గ్గింది. ఎందుకంటే.. కూక‌ట్‌ప‌ల్లిలో బుచ్చ‌మ్మ అనే మ‌హిళ ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డంతో కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి షాక్ త‌గిలిన‌ట్లు అయింది. త‌న ఇల్లు ఎఫ్‌టీఎల్ ప‌రిధిలో ఉంద‌ని, కూల్చేస్తామంటూ అధికారులు బెదిరింపుల‌కు పాల్ప‌డ‌డంతో బుచ్చ‌మ్మ తీవ్ర మ‌న‌స్తాపానికి గురై ఉరేసుకున్న‌ట్లు కుటుంబ స‌భ్యులు పేర్కొన్నారు.

ఈ ఉద్రిక్త ప‌రిస్థితుల నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం సూచ‌న‌ల మేర‌కు హైడ్రా వెన‌క్కి త‌గ్గిన‌ట్లు తెలిసింది. మూసీ ప‌రివాహ‌క ప్రాంతాల్లో ఎలాంటి కూల్చివేత‌లు చేయ‌మంటూ ప్ర‌క‌ట‌న‌లు జారీ అయ్యాయి. కానీ ఇది ఎప్ప‌టి వ‌ర‌కు అనేది స్ప‌ష్టత లేదు. మూసీ బాధితుల నుంచి కూల్చివేత‌ల విష‌యంలో తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్తం అవుతున్న‌ట్లు రెవెన్యూ అధికారుల స‌ర్వేలోనూ తేలిన‌ట్లు ప్ర‌భుత్వం దృష్టికి వెళ్లింది. ప్ర‌జా వ్య‌తిరేక‌త తీవ్రంగా ఉన్న నేప‌థ్యంలో మూసీ ప‌రివాహ‌కంలో కూల్చివేత‌లు ఆపేయాల‌నే నిర్ణ‌యానికి ప్ర‌భుత్వం వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. కానీ ఈ రేవంత్ స‌ర్కార్‌ను న‌మ్మేలా లేదు అని బాధితులు పేర్కొంటున్నారు.

అయితే బుచ్చ‌మ్మ ఆత్మ‌హ‌త్య‌ల్లాంటివి ఈ న‌గ‌రంలో ఇంకెన్ని చూడాల్సి వ‌స్తుందో అనే భ‌యం కూడా అధికారుల్లో మొద‌లైన‌ట్లు తెలుస్తోంది. స‌ర్వేకు వెళ్లిన స‌మ‌యంలో చాలా మంది బాధితులు పెట్రోల్ మీద పోసుకుని ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేయ‌డం వంటి ఘ‌ట‌న‌లు చూశాం. కొంద‌రైతే తాము పెట్రోల్ పోసుకుని అధికారుల‌కు కూడా నిప్పంటించి చ‌నిపోతామ‌ని బెదిరింపుల‌కు కూడా పాల్ప‌డ్డారు. మ‌రికొంద‌రైతే రేవంత్ రెడ్డితో పాటు ఆయ‌న కుటుంబానికి త‌మ ఉసురు త‌గులుతుంద‌ని శాప‌నార్థాలు పెట్టిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. మొత్తానికి మూసీ బాధితుల ఆగ్ర‌హం, ఆక్ర‌నంద‌న‌.. ప్ర‌భుత్వ పెద్ద‌ల చెవిలోకి దూరిన‌ట్టు తెలుస్తోంది

Related posts