మహిళ తలలో సర్జికల్ సూది మరిచిన డాక్టర్..
హైదరాబాద్ సెప్టెంబర్ 30 (ప్రజాక్షేత్రం):ప్రభుత్వ ఆసుపత్రిలోని డాక్టర్, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. తలకు గాయంతో వచ్చిన యువతికి కుట్లు వేశారు. అయితే సర్జికల్ సూదిని ఆమె తలలో మరిచిపోయి కట్టుకట్టారు. ఇంటికి తిరిగి వచ్చిన ఆ యువతి బాధతో అల్లాడిపోయింది. దీంతో ఆమెను ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించగా తలలో సూది ఉన్న విషయం బయటపడింది. ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పొరుగువారితో జరిగిన ఘర్షణలో 18 ఏళ్ల సితార తలకు గాయమైంది. కుటుంబ సభ్యులు ఆమెను ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. తల గాయాన్ని పరిశీలించిన డాక్టర్, అక్కడి సిబ్బంది సహాయంతో కుట్లు వేశాడు. ఆ తర్వాత తల గాయానికి కట్టుకట్టి ఆమెను ఇంటికి పంపించారు. కాగా, ఇంటికి చేరుకున్న యువతి నొప్పితో అల్లాడిపోయింది. ఆమె అరిచి గోల చేయడంతో కుటుంబ సభ్యులు ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడి డాక్టర్లు కట్టు విప్పి తల గాయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా తలకు వేసిన కుట్ల వద్ద సూది ఉన్నట్లు గమనించారు. దానిని తొలగించి ఆ గాయానికి కట్టువేశారు. దీంతో యువతికి ఆ బాధ నుంచి ఉపశమనం లభించింది. మరోవైపు తల గాయం వద్ద సూది మరిచిపోయి కట్టుకట్టిన ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ నిర్లక్ష్యంపై యువతి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో ఉన్న డాక్టర్ మద్యం సేవించి ఉన్నాడని ఆమె తల్లి ఆరోపించింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆ డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేసింది. దీంతో జిల్లా చీఫ్ మెడికల్ అధికారి స్పందించారు. కమిటీని ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు చేపడతామని చెప్పారు.