ధరల నియంత్రణ ప్రభుత్వ కనీస బాధ్యత..
–పెరిగిన ధరలతో, పండగ పూట పస్తులేనా…?
–పేద, మద్యతరగతి ప్రజలకు తప్పని అప్పుల తిప్పలు..
హైదరాబాద్ అక్టోబర్ 05(ప్రజాక్షేత్రం):ప్రతి పక్షంలో ఉన్నప్పుడు ధరల విషయంలో ఆందోళనలు చేసి, రోడ్ల పైకి వచ్చి ఉద్యమాలు చేపట్టిన పెద్దలే అధికారం లోకి రాగానే మారిపోతున్నారు. ఇటీవల అదుపు లేకుండా పెరిగిపోతున్న నిత్యావసర వస్తువుల ధరలతో అన్ని వర్గాల ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. ముఖ్యంగా పండుగ సీజన్ లో ప్రజల అవసరాలను ముందుగానే పసిగట్టిన వ్యాపారులు ఒక వ్యూహం ప్రకారం వస్తువుల కృత్రిమ కొరత సృష్టించి, ఇష్టానుసారం ధరలు పెంచుతూ లక్షలు గడిస్తున్నారు. ఏ వస్తువు ధర ఎప్పుడు పెరుగుతుందో, ఎప్పుడు తగ్గుతుందో అర్థం కావడం లేదు. గత మూడు నాలుగేళ్లుగా వరి ధాన్యం అధిక దిగుబడులు వచ్చాయి. నిల్వ చేద్దామంటే గిడ్డంగులు కూడా సరిపోవడం లేదు. కానీ ప్రస్తుతం బియ్యం ధర మునుపెన్నడూ లేని విధంగా కిలో బియ్యం అరవై రూపాయలకు చేరింది. ఒక్క బియ్యం మాత్రమే కాదు పప్పు దినుసులు,మిర్చి, వంటనూనె ల ధరలు ఆకాశాన్ని తాకాయి. పేద, మద్యతరగతి, సామాన్యులు రాబోయే దసరా పండుగ సందర్భంగా కావాల్సిన సరుకులు కొని సంతోషంగా పండుగ జరుపుకోనే స్థితిలో లేరు. ముడి, రిఫైండ్ వంటనూనె ల పై కేంద్రం దిగుమతి సుంకాన్ని ఒక్కసారిగా 20 శాతం వరకు పెంచడంతో వంటనూనెల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. పామోలిన్, సోయా, సన్ ఫ్లవర్ , సహా వివిధ రకాల నూనె లపై ఈ భారం పడనుంది. వీటి ముడి నూనె లపై ఇప్పటివరకు సుంకం ఉండేది కాదు. ఇప్పుడు సుంకం ఏకంగా 20 శాతం విధించడం వల్ల పేద మద్యతరగతి ప్రజలపై అధిక భారం పడనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం వంటనూనె ధర లీటరుకు 20 నుండి 40 రూపాయలు పెరిగింది. అల్లం కిలో 100 నుండి -150 కి , వెల్లుల్లి కిలో 300 నుండి -360, ఎండుమిర్చి కిలో 200 నుండి 240కి, కందిపప్పు కిలో 150 నుండి 175 కి, మినప్పప్పు కిలో 135 కు చేరింది . అలాగే పెసరపప్పు కిలోకు 30 రూపాయలు, ఉల్లిపాయలు కిలో 60 రూపాయలకు చేరింది. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు జన జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. పెరిగే ధరలను నియంత్రించాలి.. వినియోగదారుల సంఘం జిల్లా అధ్యక్షులు… కొడారి వెంకటేష్ .. రోజు రోజుకు పెరిగి పోతున్న నిత్యావసర వస్తువుల ధరల ప్రభావం బడుగు , పేద వర్గాల ప్రజలే కాదు మద్యతరగతి ప్రజలకు కూడా భారం కానుంది. వ్యవసాయ మార్కెట్ పాలకులు, సివిల్ సప్లయ్, తూనికలు కొలతల శాఖ అధికారులు స్పందించి పెరిగే ధరలను అదుపు చేయాలి. నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ పద్ధతులను ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేయాలి. పేద మద్యతరగతి ప్రజలకు అండగా ఉండాలి. కృత్రిమ కొరతను సృష్టించే, వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. కల్తీకి పాల్పడే వ్యాపారులపై ఉక్కు పాదం మోపాలి.