Praja Kshetram
తెలంగాణ

రాజకీయాలకతీతంగా చేవెళ్ల అభివృద్ధి.

రాజకీయాలకతీతంగా చేవెళ్ల అభివృద్ధి.

 

 

చేవెళ్ల అక్టోబరు 08 (ప్రజాక్షేత్రం):వేర్వేరు రాజకీయ పార్టీల ద్వారా ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనా.. చేవెళ్ల ప్రాంత అభివృద్ధి విషయంలో రాజకీయాలకతీతంగా కలిసి సాగుతానని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పరిశ్రమల మంత్రిత్వ శాఖ స్థాయీ సంఘ సమావేశంలో పాల్గొనడానికి హస్తినకు వెళ్లిన ఎంపీ న్యూఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్‌రెడ్డిని కలిసి జిల్లాకు సంబంధించిన పలు విషయాలపై ఆయనతో చర్చించారు. ముఖ్యంగా జీవో నెంబర్‌ 111 ప్రాంతాన్ని ససైనబుల్‌ డెలవ్‌పమెంట్‌ జోన్‌గా మార్చాలని, టీఆర్‌ఎస్‌ హయాంలో ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న షాబాద్‌ మండలంలోని సీతారాంపురం గ్రామ దేవాలయం భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని, జంట నగరాలలో నడుస్తున్న సీవరేజ్‌ ట్రీట్మెంట్‌ ప్లాంట్ల నిర్వహణతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణపై పలు సూచనలు చేసినట్లు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం పెండింగ్‌లో ఉన్న సమస్యలపై సమగ్ర చర్చ జరిపి సీఎంకు నిర్ధిష్టమైన సూచనలు చేసినట్లు పేర్కొన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోపాటు రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి తన సహాయ సహకారాలు, సూచనలు సలహాలు ఎల్లవేళలా అందిస్తానని రేవంత్‌రెడ్డికి తెలిపినట్లు చెప్పారు. కాగా, రాజకీయాలకతీతంగా రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాలను అభివృద్ధి పథంలో మైలురాళ్లుగా నిలపడమే తన ముందున్న ప్రథమ కర్తవ్యం అని ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు.

Related posts